Rohingya refugee boat sinks: మునిగిన బోటు.. రోహింగ్యా శరణార్థుల గల్లంతు
Rohingya refugee boat sinks: రోహింగ్యా శరణార్థులతో కూడిన బోటు సముద్రంలో మునిగిపోవడంతో దాదాపు 12 మంది గల్లంతయ్యారు.
రోహింగ్యా శరణార్థులతో వెళుతున్న పడవ అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా మునిగిపోవడంతో మంగళవారం బంగ్లాదేశ్ తీరంలో కనీసం డజను మంది గల్లంతయ్యారని ఆ దేశపు కోస్ట్ గార్డ్ తెలిపింది.
చేపల వేటకు వినియోగించే ఈ బోటు తెల్లవారుజామున మలేషియాకు బయలుదేరింది. బంగాళాఖాతంలో అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మునిగిపోయింది. బోటులో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించడానికి రెండు బోట్లు ప్రయత్నిస్తున్నట్టు కోస్ట్ గార్డ్ తెలిపింది.
‘మేం 35 మంది రోహింగ్యా శరణార్థులు, నలుగురు బంగ్లాదేశీయులతో సహా 39 మందిని రక్షించాం..’ అని కోస్ట్ గార్డ్ ప్రతినిధి లెఫ్టినెంట్ అల్ అమీన్ ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలిపారు.
పడవలో కనీసం 50 మంది ఉన్నారని, బయలుదేరే ముందు అనేక తీరప్రాంత పట్టణాల నుండి ప్రయాణికులను ఎక్కించుకున్నారని కోస్ట్ గార్డ్ స్టేషన్ కమాండర్ ఆషిక్ అహ్మద్ తెలిపారు. ‘సుమారు 12 మంది వ్యక్తులు తప్పిపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది..’ అని ఆయన ఏఎఫ్‌పీకి తెలిపారు.
దాదాపు పది లక్షల మంది రోహింగ్యా శరణార్థులు నివసించే శిబిరాలు ఉన్న దక్షిణ కాక్స్ బజార్ జిల్లా సమీపంలో ఈ ఓడ మునిగిపోయింది.
ఐదేళ్ల క్రితం పొరుగున ఉన్న మయన్మార్‌లో సైనిక అణిచివేత తర్వాత చాలా మంది బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ఆ అంశంపై ఐక్య రాజ్య సమితి ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
శిబిరాల్లోని భయంకరమైన పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది శరణార్థులు స్మగ్లర్లకు డబ్బులు చెల్లించి ప్రమాదకరమైన సముద్ర మార్గం గుండా మలేషియాకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.