Gaza massacre: గాజాలో ఇజ్రాయెల్ దళాల ఘాతుకం; సాయం కోసం వేచి ఉన్న పౌరులపై కిరాతకంగా కాల్పులు; వంద మందికి పైగా మృతి
Gaza massacre: గాజాలో ఇజ్రాయెల్ దళాలు మరోసారి కిరాతకంగా వ్యవహరించాయి. నిత్యావసరాలను తీసుకువచ్చే ట్రక్స్ కోసం ఎదురు చూస్తున్న గాజా పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ తీరును అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.
Gaza massacre: గాజా సిటీ సమీపంలో సహాయం కోసం వేచి ఉన్న ప్రజలపై ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో 104 మంది పాలస్తీనియన్లు మరణించారని, 280 మంది గాయపడ్డారని గాజాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తమకు తెలియదని ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. గోధుమ పిండి సహా పలు నిత్యావసర వస్తువులతో ఉత్తర గాజాకు సహాయక ట్రక్కులు వచ్చినప్పుడు తొక్కిసలాట జరగడం వల్ల డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ముప్పు ఉందని..
అయితే, సాయం కోసం గుంపులుగా నిల్చుని ఎదురు చూస్తున్న గాజా (Gaza massacre) పౌరుల వల్ల ముప్పు ఉందని భావించిన ఇజ్రాయెల్ సైన్యం ఆ అమాయక పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తమకు ముప్పుగా పరిణమించిన గుంపులోని పలువురిపై సైనికులు కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.
అధ్యక్షుడి ఖండన
‘ అల్ నబుసీ సెంటర్ వద్ద సహాయక ట్రక్కుల కోసం వేచి ఉన్న ప్రజలపై ఈ ఉదయం ఇజ్రాయెల్ ఆక్రమణ సైన్యం నిర్వహించిన వికృత మారణకాండను ఖండిస్తున్నాను’ అని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. గాజా సిటీకి పశ్చిమాన ఉన్న అల్-నబుసీ వద్ద ఈ ఘటన జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రా తెలిపారు. ఈ ఘటన అనంతరం ఆసుపత్రికి వెల్లువలా వచ్చిన క్షతగాత్రులను, మృతదేహాలను చూసి వైద్య బృందాలు తట్టుకోలేకపోయాయని ఖిద్రా చెప్పారు. తమ ఆసుపత్రికి 10 మృతదేహాలు, డజన్ల కొద్దీ గాయపడిన రోగులు వచ్చారని గాజా సిటీలోని కమల్ అద్వాన్ ఆసుపత్రి హుస్సామ్ అబు సఫియా తెలిపారు.
హమాస్ ఆగ్రహం
ఇజ్రాయెల్ తో జరుగుతున్న చర్చలకు ఈ ఘటన విఘాతం కలిగిస్తుందని హమాస్ హెచ్చరించింది. కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా జరిగిన చర్చలు ఈ ఘటన వల్ల విఫలం కావొచ్చని తెలిపింది.
మృతదేహాలతో నిండిన ట్రక్కులు
ఈ ఘటన అనంతరం, మృతదేహాలతో నిండి ఉన్న ట్రక్కులు వెళ్తున్న దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకే ట్రక్ లో మృతదేహాలు, క్షతగాత్రులు కుక్కి ఉన్న వీడియో వైరల్ గా మారింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ లోకి ఫైటర్లను పంపడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. హమాస్ సుమారు 1,200 మంది ఇజ్రాయెలీలని చంపిందని, 253 మంది బందీలను పట్టుకున్నారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ తరువాత, ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి చొచ్చుకువెళ్లి, యుద్ధం ప్రారంభించాయి. నాటి నుంచి గాజాలో 30,000 మంది చనిపోయారని, వేలాది మంది శిథిలాల కింద కూరుకుపోయారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు.
టాపిక్