Indian student dies in US : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి- నెల రోజుల్లో నలుగురు!
06 April 2024, 7:44 IST
Indian student dies in Ohio : అమెరికాలో మరో భారత విద్యార్థి మరణించాడు. ఒహాయోలో ఉమా గద్దె అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా.. అమెరికాలో నెల రోజుల్లో నలుగురు భారతీయులు మృతిచెందారు.
అమెరికాలో.. నెల రోజుల్లో నలుగురు భారతీయులు మరణించారు!
Indian student dies in US : అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అతను ఎలా మరణించాడో ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అతని పేరు ఉమా సత్యసాయి గద్దె అని పేర్కొంది.
అమెరికాలో భారతీయుడు మృతి..
'ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె దురదృష్టవశాత్తు మరణించడం చాలా బాధాకరం,' అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఒక పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.
ఈ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని, భారత్‌లోని విద్యార్థి కుటుంబంతో టచ్‌లో ఉన్నామని కాన్సులేట్ తెలిపింది.
ఉమా గద్దె పార్థివదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడం సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కాన్సులేట్ స్పష్టం చేసింది.
అయితే.. ఉమా గద్దె ఎలా మరణించాడు? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
నెల రోజుల్లో నలుగురు మృతి..
Uma Satya Sai Gadde death in America : 2024 ప్రారంభం నుంచి అమెరికాలో ఆరుగురు కన్నా ఎక్కువ మంది భారతీయ, భారత సంతతి విద్యార్థులు మరణించారు. దాడుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
గత నెలలో మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో భారత్‌కు చెందిన 34 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్ నాథ్ ఘోష్‌ను దుండగులు కాల్చి చంపారు.
పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్న 23ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్.. ఫిబ్రవరి 5న ఇండియానాలోని ప్రకృతి సంరక్షణ కేంద్రంలో శవమై కనిపించాడు. ఇది తీవ్ర కలకలం సృష్టించింది.
ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో భారత సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా (41) ప్రాణాలు కోల్పోయాడు.
Indian student died in US : భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు/విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం, వివిధ ప్రాంతాల్లోని కాన్సులేట్ల అధికారులు.. అమెరికా నలుమూలల నుంచి వచ్చిన భారతీయ విద్యార్థులతో వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించి, విద్యార్థుల శ్రేయస్సుకు సంబంధించిన వివిధ అంశాలు, పలుకబడి ఉన్న ప్రవాస భారతీయులతో కనెక్ట్ అయ్యే మార్గాలపై చర్చించారు.
చార్జ్ డీ అఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియ రంగనాథన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అమెరికాలోని 90 విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Indian students in America : అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటెల్లోని భారత కాన్సులేట్ జనరల్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.
ఏది ఏమైనా.. చదువు, ఉద్యోగాల కోసం వెళ్లుతున్న భారతీయులు అమెరికాలో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. భారత్‌లో ఉంటున్న తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తున్నాయి.