Student suicide: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య; 2024 లో ఆరవ దుర్మరణం
Student suicide in Kota: రాజస్తాన్ లోని కోటా లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్, ఐఐటీ జేఈఈ పరీక్షల శిక్షణకు పేరు గాంచిన కోటాలో ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కోటాలో 2023లో 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
Another student suicide in Kota: అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)కు ప్రిపేర్ అవుతున్న 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని కోటా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జిల్లాలో గత ఏడాది వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
యూపీ నుంచి వచ్చి..
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కోటా (kota) విజ్ఞాన్ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సతీశ్ చంద్ తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ కు చెందిన విద్యార్థి ఆ ప్రాంతంలోని తన అద్దె అపార్ట్ మెంట్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య (student suicide in Kota) చేసుకున్నాడని తెలిపారు. ‘‘ఉదయం తల్లిదండ్రులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. వారు జవహర్ నగర్ లో ఉంటున్న ఆ విద్యార్థి స్నేహితులకు ఫోన్ చేశారు. దాంతో, అతని స్నేహితులు అపార్ట్ మెంట్ కు చేరుకుని ఇంటి యజమానికి, సెక్యూరిటీ గార్డుకు ఫోన్ చేసి తలుపులు పగలగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఆ విద్యార్థి కనిపించింది’’ అని సతీశ్ చంద్ తెలిపారు.
ఏడాదిగా కోటాలోనే..
గత ఏడాదిగా కోటాలో ఉంటూ ఆ విద్యార్థి నీట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే, తాను ఉంటున్న హాస్టల్ నుంచి ఈ అపార్ట్ మెంట్ కు షిఫ్ట్ అయ్యాడు. అతని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, అతని మృతిపై తల్లిదండ్రులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం చేయడం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో, అతని ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని సతీశ్ చంద్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఫేమస్
నీట్, జేఈఈ కోచింగ్ కు రాజస్తాన్ లో ని కోటా చాలా ఫేమస్. ఇక్కడ ఏటా ఈ కోచింగ్ పేరుపై రూ .10,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పదో తరగతి పూర్తయిన తర్వాత దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి రెసిడెన్షియల్ టెస్ట్ ప్రిపరేషన్ ఇన్ స్టిట్యూట్ లకు రిజిస్టర్ చేసుకుంటారు. కోచింగ్ తో పాటు, సర్టిఫికెట్ కోసం ఇక్కడే ఏదైనా జూనియర్ కాలేజీలో కూడా చేరుతారు. సంవత్సరాల తరబడి విద్యార్థులు తమ కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల ఒత్తిడికి లోనవుతారు.
ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు
కోటా లో 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కోచింగ్ సంస్థలు మూసివేయడం లేదా ఆన్లైన్లో పనిచేయడంతో 2020 మరియు 2021 లో ఎటువంటి ఆత్మహత్యలు నమోదు కాలేదు.
ఈ సంవత్సరం ఆరు ఆత్మహత్యలు
2024 లో కోటా లో ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు బలవన్మరణం చెందారు. బీహార్ కు చెందిన 16 ఏళ్ల జేఈఈ విద్యార్థి మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా, 16 ఏళ్ల ఛత్తీస్ గఢ్ జేఈఈ విద్యార్థి ఫిబ్రవరి 13న జవహర్ నగర్ హాస్టల్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో 19 ఏళ్ల నీట్ విద్యార్థి జనవరి 23న జవహర్ నగర్ లో ఆత్మహత్య చేసుకోగా, కోటాకు చెందిన 18 ఏళ్ల జేఈఈ విద్యార్థి కూడా జనవరి 29న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పది రోజులుగా కనిపించకుండా పోయిన మధ్యప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల జేఈఈ విద్యార్థి ఫిబ్రవరి 19న కోటాలోని చంబల్ అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు.