Kota suicide: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య; జేఈఈ మెయిన్స్ ఫలితాల రోజే..
Kota suicide: రాజస్తాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, చత్తీస్ గఢ్ కు చెందిన విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
JEE Mains: జేఈఈ-మెయిన్ 2024 మొదటి ఎడిషన్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రచురించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్లోని కోటాలో 16 ఏళ్ల జేఈఈ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విద్యార్థి బలవన్మరణంతో కోటాలో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య మూడుకు చేరింది. మంగళవారం ఉదయం కోటాలోని జవహర్ నగర్ ప్రాంతంలోని తన హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు చత్తీస్ గఢ్ కు చెందిన శుభ్ చౌదరి ఉరేసుకుని కనిపించాడని సర్కిల్ ఆఫీసర్ (CO) డీఎస్పీ భవానీ సింగ్ తెలిపారు.
12వ తరగతి విద్యార్థి
ఛత్తీస్ గఢ్ కు చెందిన శుభ్ చౌదరి 12వ తరగతి విద్యార్థి. ఈ సంవత్సరం జేఈఈ-మెయిన్ 2024 పరీక్షకు హాజరయ్యాడు. అయితే, జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడడానికి కొన్ని గంటల ముందే KOTA లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతడి ఫలితం ఏమైందనే విషయం ఇంకా తెలియరాలేదు. జేఈఈ-మెయిన్ 2024 మొదటి ఎడిషన్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. కోటాలోని ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో జేఈఈకి ప్రిపేర్ అవుతున్న చౌదరి రెండేళ్లుగా జవహర్ నగర్ ప్రాంతంలోని హాస్టల్ లో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.
హాస్టల్ గదిలో..
మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పదేపదే ఫోన్ చేసినా బాలుడు స్పందించకపోవడంతో.. వారు హాస్టల్ వార్డెన్ ను సంప్రదించారు. తమ కుమారుడి గదికి వెళ్లి, అతడితో మాట్లాడించాలని కోరారు. దాంతో, శుభ్ చౌధరి గదికి వెళ్లిన వార్డెన్ కు.. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న చౌదరి మృతదేహం కనిపించింది. దాంతో, అతడు, ఆ విద్యార్థి తల్లిదండ్రులకు, పోలీసులకు వెంటనే సమాచారం అందించాడు. ఆ విద్యార్థి సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, అతని గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, అనుమానాస్పద ఆత్మహత్యకు అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు యాంటీ సూసైడ్ డివైజ్ ను అమర్చలేదని తెలిపారు.
తల్లిదండ్రులకు..
మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, ఛత్తీస్ గఢ్ నుంచి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. జనవరి నుంచి కోటాలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో బీటెక్ చదివిన 27 ఏళ్ల విద్యార్థి కూడా ఉన్నాడు. 2023లో కోటాలో మొత్తం 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కోసం దేశవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు కోచింగ్ హబ్ అయిన ఈ కోటాకు ఏటా వస్తుంటారు.