Kota suicide: రాజస్తాన్ లోని కోటా లో మరో విద్యార్థి ఆత్మహత్య; ఈ ఏడాది ఇది మూడో సూయిసైడ్
రాజస్తాన్ లోని కోటా లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ లో ఇంజనీరింగ్ చదువుతున్న, ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆ యువకుడు 2016 నుంచి కోటాలో నివసిస్తున్నాడు.
చెన్నైలోని ఒక విద్యా సంస్థలో ఆన్ లైన్ విధానంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కోటా (kota)కు చెందిన, 27 ఏళ్ల ఓ విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటాలోని విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని ఓ అద్దె గదిలో అతని మృతదేహం లభ్యమైందని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 27 ఏళ్ల యువకుడు 2016 నుంచి కోటాలో ఉంటున్నాడని విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కౌసల్య గలావ్ తెలిపారు.
2016 నుంచి..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆ యువకుడు జేఈఈ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ కావడానికి 2016లో కోటాలోని ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. 2019లో కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి కోటాలోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి టిఫిన్ డెలివరీ బాయ్ తన గదిలో ఉన్న బాక్స్ ను తీసుకోవడానికి వెళ్లగా డోర్ బయట టిఫిన్ బాక్స్ కనిపించలేదు. అనంతరం, ఆ డెలివరీ బోయ్ గది తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో ఇంటి యజమానికి సమాచారం అందించాడు. దాంతో, యజమాని గది తలుపులు పగులగొట్టి చూడగా 27 ఏళ్ల ఆ యువకుడు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.
2023 లో 26 మంది విద్యార్థులు
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కౌసల్య గలావ్ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపించామని, కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చామని తెలిపారు. కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఐఐటీలు సహా దేశ వ్యాప్తంగా ఉన్నఅగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు రాజస్తాన్ లోని కోటాకు వస్తుంటారు. పరీక్షల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కోటాలో గతేడాది 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.