JNU election : దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జేఎన్‌యూకి దళిత స్టూడెంట్ ప్రెసిడెంట్!
JNU election results : దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జేఎన్‌యూకి దళిత స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎంపికయ్యారు. అతని పేరు ధనుంజయ్.
Dhananjay JNU : జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ).. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వామపక్ష మద్దతు గ్రూపుల నుంచి తొలి దళిత అధ్యక్షుడిని ఆదివారం ఎన్నుకుంది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో.. యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ తన సమీప ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీని ఓడించి క్లీన్ స్వీప్ చేసింది.
జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల పూర్తి వివరాలు..
నాలుగేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో.. జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ పోస్ట్‌ని.. 2,598 ఓట్లతో దక్కించుకున్నారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ)కు చెందిన ధనంజయ్. ఆయన ప్రత్యర్థి, అఖిల భారతీయ విద్యార్థి పరిషద్‌కు చెందిన ఉమేశ్ సీ అజ్మీరకు 1,676 ఓట్లు పడ్డాయి.
JNU election results : ధనుంజయ్.. బిహార్‌లోని గయనకు చెందిన వ్యక్తి. 1996-97లో ఎన్నికైన బత్తి లాల్ బైర్వా తర్వాత.. వామపక్షాల నుంచి వచ్చిన తొలి దళిత అధ్యక్షుడు ధనుంజయ్.
విజయం అనంతరం ధనుంజయ్ మాట్లాడుతూ.. ‘విద్వేషం, హింసా రాజకీయాలను జేఎన్‌యూ విద్యార్థులు తిరస్కరిస్తున్నారనడానికి ఈ విజయం రెఫరెండం. విద్యార్థులు మాపై తమకున్న నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు. వారి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని, విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తాము’ అని అన్నారు.
క్యాంపస్‌లో మహిళల భద్రత, నిధుల కోత, స్కాలర్ షిప్ పెంపు, మౌలిక సదుపాయాలు, నీటి సంక్షోభం వంటి అంశాలపై తమ విద్యార్థి సంఘం తొలి ప్రాధాన్యం ఇస్తోందని ధనుంజయ్ స్పష్టం చేశారు.
JNUSU election results : ఎన్నికల ఫలితాల అనంతరం జేఎన్‌యూలో ఆహ్లాదక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 'లాల్ సలాం', 'జై భీమ్' నినాదాల మధ్య.. గెలుపొందిన విద్యార్థులను వారి మద్దతుదారులు అభినందించారు. ఎరుపు, తెలుపు, నీలం రంగు జెండాలను ఎగురవేసి అభ్యర్థుల విజయం పట్ల సంబరాలు చేసుకున్నారు.
ఉపాధ్యక్ష పదవికి విద్యార్థి సమాఖ్య ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) అభ్యర్థి అవిజిత్ ఘోష్ 927 ఓట్ల తేడాతో ఏబీవీపీ అభ్యర్థి దీపికా శర్మపై విజయం సాధించారు.
వామపక్షాల మద్దతుతో బిర్సా అంబేడ్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ (బాప్సా) అభ్యర్థి ప్రియాన్షి ఆర్య ప్రధాన కార్యదర్శి పదవిని ఏబీవీపీ అభ్యర్థి అర్జున్ ఆనంద్‌పై 926 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆర్యకు 2,887 ఓట్లు రాగా, ఆనంద్ కు 1961 ఓట్లు వచ్చాయి.
వామపక్షాల అభ్యర్థి మహ్మద్ సాజిద్ 508 ఓట్ల తేడాతో ఏబీవీపీ అభ్యర్థి గోవింద్ డాంగిపై విజయం సాధించారు. మొత్తం నలుగురు విజేతల్లో అతనిది అత్యల్ప విజయం.
JNUSU election results 2024 : లెఫ్ట్ ప్యానెల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో జేఎన్‌యూ అనేది వామపక్షాల కంచుకోట అన్న పేరు మరోమారు నిరూపితమైంది. ఏబీవీపీకి గట్టిపోటీ ఇచ్చి నాలుగు సెంట్రల్ ప్యానెల్ పదవుల్లోనూ ఆధిక్యంలో నిలిచింది.
యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్లో ఏఐఎస్ఏ, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఉన్నాయి.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి.. 73 శాతం పోలింగ్ నమోదైంది.
సంబంధిత కథనం