IMD forecasts heavy rains : ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
25 September 2022, 15:40 IST
- Heavy rain alert IMD : రానున్న కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
IMD forecasts heavy rains : దేశంపై రుతుపవనాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఇచ్చింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). ఆదివారం నుంచి ఈ నెల 27 వరకు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఐఎండీ ప్రకారం.. జమ్ముకశ్మీర్, ఉత్తర పంజాబ్, ఈశాన్య హరియాణా, ఉత్తర ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు.
Rains in India today : బిహార్, పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కింలోని పలు ప్రాంతాల్లో సోమవారం విస్తృతంగా వర్షాలు పడతాయి. ఇది బుధవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 27న.. ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
ఈశాన్య భారతంలోని అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈ నెల 25 నుంచి 27 వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.
Heavy rains in Delhi : ఢిల్లీలో కుంభవృష్టి..
Delhi rains : ఇక దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఇక రానున్న రోజుల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.