Rain in Hyd: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
22 September 2022, 13:25 IST
- rain in hyderabad: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది.
భాగ్యనగరంలో వర్షం
weather updates of telugu states: తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలను వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ తో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ లో వర్షం....
గురువారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి, శంషాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, వెంగల్ రావు నగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, అమీర్‌పేట ప్రాంతాల్లో వర్షం పడింది. బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పూర్, దోమలగూడ, గాంధీనగర్ జవహర్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
ఎల్లో అలర్ట్...
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని తెలిపింది.
జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత...
హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా గేట్లు విరగ్గొట్టి దూసుకు రావడంతో కొందరు కిందపడిపోయారు. దీంతో కొందరు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో పోలీసులు క్రికెట్ అభిమానులపై లాఠీ ఛార్జీ చేశారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో వందల సంఖ్యలో వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ దూసుకు వచ్చారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఓ మహిళా కూడా మృతి ప్రాణాలు కోల్పోయింది. హెచ్ సీఏ తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.