Hathras stampede: హత్రాస్ తొక్కిసలాటలో వంద మందికి పైగా చనిపోవడానికి కారణమైన భోలే బాబా ఎవరు?
02 July 2024, 20:30 IST
ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో మంగళవారం దారుణమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక సత్సంగ్ కార్యక్రమం ముగిసిన తరువాత భక్తులంతా ఒక్కసారిగా బయటకు వచ్చే క్రమంలో జరిగిన ఈ తొక్కిసలాటలో 107 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు.
హాత్రాస్ లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా, ఆయన భార్య
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో మంగళవారం జరిగిన ఒక మత కార్యక్రమంలో తొక్కిసలాటలో 107 మంది మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, అక్కడ సత్సంగ్ ను ఏర్పాటు చేసిన మత ప్రబోధకుడు భోలే బాబా ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎవరీ భోలే బాబా?
హత్రాస్ లో తొక్కిసలాటకు కారణమైన సత్సంగ్ ను ఏర్పాటుచేసింది భోలే బాబా అనే వ్యక్తి. అతడు లీగఢ్ డివిజన్ లోని కాస్ గంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందినవాడు. అతడు 18 ఏళ్ల పాటు ఉత్తర ప్రదేశ్ లోని పోలీసు శాఖలో పనిచేశారు. యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని విడిచిపెట్టిన తర్వాత బాబా అవతారం ఎత్తారు. ప్రవచనాలు చెప్పడం, 'సత్సంగం' నిర్వహించడం ప్రారంభించాడు. 'నారాయణ్ సకార్ హరి' అని పిలుచుకునే బాబా పాపులారిటీ కాలక్రమేణా పెరిగి వేలాది మంది అనుచరులు తయారయ్యారు.
తెల్లని దుస్తుల్లో..
'సకర్ విశ్వ హరి బాబా'గా కూడా ప్రాచుర్యం పొందిన భోలే బాబా తెల్లని దుస్తులు ధరించి మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. తన భార్యతో కలిసి సత్సంగ్ లను నిర్వహిస్తారు. సాధారణ బాబాల తరహాలో కాకుండా, మామూలు వ్యక్తిలాగానే కనిపించడం ఈ భోలే బాబా ప్రత్యేకత. అతని అనుచరులు ఎక్కువగా బ్రజ్ ప్రాంతంలోని ఆగ్రా, అలీఘర్ డివిజన్లకు చెందిన దిగువ ఆర్థిక వర్గాలకు చెందినవారే.
ఫేస్ బుక్ లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు
తనకు గురువు ఎవరు లేరని, స్వయంగా భగవంతుడే తనకు సత్యాన్ని బోధించారని భోలే బాబా చెబుతారు. ఆయనకు ఫేస్ బుక్ లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా మంగళవారాల్లో ఆయన సత్సంగ్ లను నిర్వహిస్తారు. ఆ సత్సంగ్ లకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
మీడియాకు దూరం
ఆయనకు ప్రజాదరణ ఉన్నప్పటికీ మీడియాను 'సత్సంగ్'కు దూరంగా ఉంచారు. భోలే బాబాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలేవీ బయటకు తెలియదు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు ఉంటుంది. కాగా, గులాబి రంగు చొక్కాలు, ప్యాంట్లు, తెల్లటి టోపీలు ధరించిన బాబా మనుషులు ఆయన సత్సంగ్ సభల్లో ట్రాఫిక్, అంతర్గత ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కనిపించారు.
తొక్కిసలాటకు కారణం
హత్రాస్ (Hathras stampede) లో మధ్యాహ్నం సత్సంగ్ ముగియడంతో మహిళా భక్తులు సభాస్థలి నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్లడం ప్రారంభించడంతో తొక్కిసలాట మొదలైనట్లు ప్రాథమిక సమాచారం. వేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా ఆవరణలో కొంతమందికి ఊపిరాడలేదని, సత్సంగ్ ముగియగానే ఎన్ క్లోజర్ లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారని, తొక్కిసలాట జరిగి ఎక్కువగా మహిళలు, పిల్లలు చనిపోయారని అలీగఢ్ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ తెలిపారు. పొరుగున ఉన్న ఈటాలోని జిల్లా ఆసుపత్రిలో చేరిన జ్యోతి అనే టీనేజర్ మాట్లాడుతూ అందరూ హడావుడిగా ఎన్ క్లోజర్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారని చెప్పారు. మరో మార్గం లేకపోవడంతో ప్రజలు ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట (Hathras stampede) జరిగిందని తెలిపారు. తాను సభాస్థలి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించానని, కానీ బయట నిలిపి ఉంచిన మోటార్ సైకిళ్లు తన దారిని అడ్డుకున్నాయని జ్యోతి గుర్తు చేసుకున్నారు "చాలా మంది స్పృహతప్పి పడిపోయారు... మరికొందరు చనిపోయారు' అని జ్యోతి తెలిపారు.