Khammam Politics : ఉదయం గులాబి కండువా, సాయంత్రం కాంగ్రెస్ కండువా!
Khammam Politics : ముదిగొండ సహకార సంఘం అధ్యక్షుడు వెలగొండ స్వామి గంటల వ్యవధిలో రెండు కండువాలు మార్చారు. శనివారం ఉదయం బీఆర్ఎస్ లో చేరిన ఆయన సాయంత్రం కాంగ్రెస్ గూటికి చేరారు.
Khammam Politics : ఖమ్మం జిల్లా ముదిగొండ సహకార సంఘం అధ్యక్షుడు తుపాకుల వెలగొండ స్వామి పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడుగా ఉండే ఈయన శనివారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పించుకొని బీఆర్ఎస్ లో చేరారు. స్వామితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి పువ్వాడ విజయాన్ని ఆకాంక్షిస్తూ తాము బీఆర్ఎస్ లో చేరుతున్నామని ప్రకటించారు.
సాయంత్రం మళ్లీ కాంగ్రెస్ కండువా
వెలగొండ స్వామి బీఆర్ఎస్ లో చేరారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సరిగ్గా నాలుగు గంటల పాటు ఈ వార్త వాట్సాప్, ఫేస్ బుక్ లలో చక్కర్లు కొట్టింది. సీన్ కట్ చేస్తే సాయంత్రం పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వెలుగొండ స్వామి మళ్లీ తుమ్మల సమక్షానికి చేరుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అనూహ్య పరిణామంతో జనం నోరెళ్ల బెట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు సర్వసాధారణమే అయినప్పటికీ రాజకీయ విలువలను కాలరాస్తున్న తీరు విస్తుగొలుపుతోందని స్థానికులు అంటున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం