5 నుంచి పెద్దాపురం మరిడమ్మ ఉత్సవం... 37 రోజుల పాటు జాతరకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి ఉత్సవం జూలై 5 నుంచి జరగనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఎంతో విశిష్టత కలిగిన మరిడమ్మ వారి ఉత్సవానికి రాష్ట్ర నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు.
జులై 5 నుంచి జరగున్న పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ ఉత్సవ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీమరిడమ్మ వారి దేవస్ధానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిడమ్మ ఆషాఢమాసం జాతర మహోత్సవం జూలై 5 నుంచి ఆగస్టు 10 వరకు 37 రోజుల పాటు జరుగుతుంది. జూలై 4 (గురువారం) రాత్రి జాగరణ ఉత్సవంతో జాతర ప్రారంభం అవుతుంది. ప్రధానంగా మంగళవారం, గురువారం, ఆదివారాల్లో భక్తుల తాకిడి భారీగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో కాస్త తక్కువగా ఉంటుంది. దాదాపు నెల రోజులకు పైగా జరిగే ఉత్సవం గోదావరి జిల్లాల్లో చాలా విశిష్టత కలిగిన పండగ. ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని నివాసం ఉంటున్న వారు కూడా ఈ ఉత్సవానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
జాగరణ ఉత్సవం..
రథంపై శ్రీ మరిడమ్మ వారి దివ్యరూప ఉత్సవమూర్తిని విద్ద్యుద్దీపాలంకరణతో సుందరంగా అలంకరిస్తారు. దేవస్థానం వారి పది గరగలతో గరగల నృత్యం చేస్తారు. శ్రీదేవి గరగ నాట్య బృందం, పేపకాయలపాలెం వారిచే గరగ నాట్యం (మహిళలు) చేస్తారు. సామర్లకోట వారిచే కేరళ డ్రమ్స్ కార్యక్రమం ఉంటుంది. అఘోర వేషాల కార్యక్రమం కూడా ఉంటుంది. నాదస్వరం, తప్పెటగుళ్లు, శూలాల సంబరం, కాళికాదేవి వేషాలు, పొడువుకాళ్లు, బుట్టబొమ్మలు, కాంతారా వంటి కార్యక్రమాలు ఉంటాయి. జాతర సమయంలో అమ్మవారి కాలక్షేప మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మరిడమ్మవారి ఉత్సవం
మరిడమ్మ అమ్మవారి మహోత్సవం ప్రతి సంవత్సరం జేష్ఠ మాసంలోని అమావాస్య నుండి ప్రారంభమై ఆషాడమాసంలోని అమావాస్య వరకు వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఒక్క ఆదివారం రోజునే 40 నుండి 50 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. అలాగే మంగళవారం, గురువారాల్లో కూడా భక్తులు భారీగానే వస్తుంటారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారు.
మరిడమ్మ తల్లి విశిష్టత
మరిడమ్మ తల్లి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందింది. 1952లో ఈ దేవాలయం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజి చెరువుకి అతి సమీపంలో శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిశారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశమంతా చిట్టడవిగా ఉండేంది. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరులకి 16 ఏళ్ల యువత కనిపించి నేను చింతపల్లి వారి ఆడపడుచుని నేను ఈ ప్రదేశంలో ఉన్నానని మా వాళ్లకు చెప్పండి అని చెప్పి మాయం అయిందని చరిత్ర చెబుతుంది.
ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు ముందే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి, తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించాలని ఆజ్ఞాపించింది. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మానోజి చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపం దర్శనమిచ్చిందని చెబుతుంటారు. ఈ గద్దెను అక్కడే ప్రతిష్టించి తాటాకు పాక వేసి ఆ నాటి నుండి నిత్య దూప, దీప, నైవేద్యములు చెల్లించి ఆరాధిస్తున్నారు.
ఉయ్యాల తాడి
జ్యేష్ట అమావాస్యకు పక్షం (పదిహేను రోజులు) ముందు అమ్మవారికి ఉయ్యాల తాడి (తాటి చెట్టు)ని వేస్తారు. ఈ ఉత్సవం రోజు నుండి ముగిసే వరకు అమ్మవారు, ఆమె ఆడపడుచులు అక్క చెల్లెళ్లు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడిపాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తులు విశ్వాసం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారివారి పొలాల గట్లమీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ముందుకు వస్తారు.
అలా రైతులు ఆలయ కమిటీకి ఆరు నెలల ముందుగానే చెప్పుకోవలసి ఉంటుంది. ఉయ్యాల తాడిని కేవలం భూజాల మీద మాత్రమే దాదాపు 100 మంది దళిత సోదరులు ఊరేగింపుగా డప్పుల దరువులతో, గరగల నృత్యాలతో దారిపొడువునా గ్రామ ప్రజలు, ఆడపడుచులు తాడిలకు నీళ్లతో కడిగి పసుపు, కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటముందు మీదుగా గుడి వద్దకు సాగనంపుతారు. ఆది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడివద్ద రావాలని అనాదిగా వస్తున్న ఆచారం.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు