Stampede: సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట; 100 మందికి పైగా దుర్మరణం
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో మంగళవారం ఒక మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా చనిపోయారు. హత్రాస్ లోని సికంద్రా పట్టణంలో ప్రత్యేకంగా వేసిన గుడారంలో ఓ మత బోధకుడు తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
భోలే బాబా సత్సంగ్ లో..
మత బోధకుడు భోలే బాబా సత్సంగ్ సమావేశంలో ఈ ప్రమాదం జరిగినట్లు అలీగఢ్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ శలభ్ మాథుర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎటా, హత్రాస్ జిల్లాలు సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని వెల్లడించారు. కార్యక్రమం ముగిసిన తరువాత ఈ తొక్కిసలాట జరిగినట్లు తమకు సమాచారం ఉందని, 100 మందికి పైగా చనిపోయినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథుర్ వెల్లడించారు. వారిలో అత్యధికులు పిల్లలు, మహిళలు ఉన్నారని తెలిపారు. మరో 150 మంది గాయపడ్డారన్నారు.
అంచనాకు మించి అనుచరులు రావడంతో..
కాగా, మత బోధకుడు భోలే బాబా సత్సంగ్ సమావేశానికి అంచనాకు మించి భక్తులు వచ్చారు. ‘‘సత్సంగం ముగిశాక అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లడం ప్రారంభించారు. బయటకు వెళ్లే మార్గం చిన్నగా ఉంది. ఆ మార్గం బయట మోటారు సైకిళ్లు నిలిపి ఉన్నాయి. అవి బయటకు వెళ్ళే మార్గాన్ని అడ్డుకున్నాయి. దాంతో, తొక్కిసలాట జరిగింది. చాలా మంది స్పృహతప్పి పడిపోగా, మరికొందరు మరణించారు’’ అని మంగళవారం మధ్యాహ్నం ఈటా జిల్లా ఆసుపత్రిలో చేరిన జ్యోతి అనే బాలిక తెలిపింది.
మరణాల సంఖ్య పెరిగే అవకాశం
అయితే, తొక్కిసలాట జరిగిన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారని, అందువల్ల, మరణాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. అప్పటికే 50కు పైగా మృతదేహాలు ఎటా జిల్లా ఆసుపత్రికి చేరుకున్నాయని తెలిపింది. సత్సంగ్ జరపడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారం లోపల ఊపిరాడక ప్రజలు అటూ ఇటూ పరిగెత్తారని, దాంతో తొక్కిసలాట జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోందని ఐజీ మాథుర్ తెలిపారు. అయితే, కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఉన్న సికంద్రా రావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రతి భాన్ పూర్ గ్రామంలో ఈ సమావేశం జరిగింది. సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడ చాలా వేడిగా, తేమగా ఉందని తెలుస్తోంది.
ప్రధాని, ముఖ్యమంత్రి స్పందన
హత్రాస్ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్ సభలో మంగళవారం ఈ ప్రమాద ఘటనపై స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి ఆసుపత్రిలో సరైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.