Hathras Gang-Rape-Murder: 2020 లో ఢిల్లీకి సుమారు 200 కిమీల దూరంలో, యూపీలో ఉన్న హథ్రాస్ లో ఒక 20 ఏళ్ల దళిత యువతి దారుణంగా సామూహిక అత్యాచారానికి (Hathras Gang-Rape) గురైంది. ఆ తరువాత తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దోషులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఈ కేసుకు (Hathras Gang-Rape) సంబంధించిన విచారణ ఉత్తర ప్రదేశ్ లోని స్థానిక కోర్టులో జరిగింది. తాజాగా, గురువారం ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన సందీప్ ఠాకూర్ ను దోషిగా తేల్చింది. అయితే, అతడిని హత్య, అత్యాచారం నేరాలపై కాకుండా, స్వల్పస్థాయి నేరారోపణలపై (culpable homicide not amounting to murder) దోషిగా తేల్చడం ఇప్పుడు వివాదంగా మారింది. అంతేకాకుండా, మరో ముగ్గురు కీలక నిందితులు రవి, లవ్ కుష్; రాములను నిర్దోషులుగా కోర్టు నిర్ధారించింది. ప్రధాన నిందితుడైన సందీప్ కు రవి అంకుల్ అవుతాడు. రాము, లవ్ కుష్ లు సందీప్ స్నేహితులు.
గ్యాంగ్ రేప్ కు పాల్పడిన యువకులు ఆ యువతిని తీవ్రంగా హింసించారు. మర్మావయవాలను దారుణంగా గాయపర్చారు. వారి దాడిలో ఆ యువతి నాలుక కట్ అయింది. వారి దాడిలో ఆ యువతికి పలు ఫ్రాక్చర్స్ అయ్యాయి. 2012 నాటి నిర్భయ ఘటన తరహాలోనే ఈ యువతిని కూడా చిత్ర హింసలు పెట్టారు. మెడపై లోతైన గాయం కావడంతో ఆ యువతి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. పోలీసులు కూడా మొదట హత్యా ప్రయత్నం అన్న నేరారోపణ పైననే కేసు నమోదు చేశారు. ఆ తరువాత బాధిత యువతి స్టేట్ మెంట్ ఇవ్వడంతో రేప్ ఆరోపణలను జత చేశారు.
హాథ్రాస్ గ్రామంలో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతి ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పోలీసులకు స్పష్టమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. పొలంలో పని చేసుకుంటుండగా, తనను నిందితులు దగ్గర్లోని తుప్పల్లోకి లాక్కు వెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని, తనను దారుణంగా హింసించారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ఆమె చనిపోయిన తరువాత పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం హడావుడిగా ఆమె మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు లేకుండానే దహనం చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించారు. దీంతో అగ్ర కులస్తులైన నిందితులను కాపాడడానికే పోలీసులు ఇలా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా స్వల్పమైన నేరారోపణలపై ప్రధాన నిందితుడిని కోర్టు దోషిగా తేల్చడం కూడా వివాదాస్పదం అయింది. పోలీసుల చార్జిషీట్ లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు.