Google Maps: గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటే అంతే..; నేరుగా కాలువలోకి దారి చూపింది..
03 December 2024, 20:40 IST
Google Maps: గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ప్రయాణిస్తున్న వారు ఇకపై జాగ్రత్తగా ఉండండి. మ్యాప్స్ చూపిన దారిలో వెళ్లి, ప్రమాదాల్లో చిక్కుకున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా, ఒక కారు గూగుల్ మ్యాప్స్ చెప్పిన దారిలో వెళ్లి కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది.
గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుంటే అంతే..; నేరుగా కాలువలోకి దారి చూపింది..
Google Maps Issues: గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ న గుడ్డిగా నమ్మకూడదని మరో ఉదంతం తెలియజేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో గూగుల్ మ్యాప్స్ చెప్పిన దారిలో వెళ్లి ఒక కారు కాలువలోకి దూసుకువెళ్లింది. డిసెంబరు 3న ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న టాటా టిగోర్ రోడ్డు మలుపులో ఉన్న కాలువలో పడిపోయింది. ఆ కారు డ్రైవర్ తన గమ్య స్థానానికి వెళ్లే మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడ్డట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను స్థానికులు ప్రాణాలతో రక్షించారు.
బ్రిడ్జిపై నుంచి పడి..
గూగుల్ మ్యాప్స్ చూపిన దారిలో వెళ్తూ, అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న బ్రిడ్జిపై నుంచి ఒక కారు పడిన ఘటన జరిగి 10 రోజులు కూడా గడవకముందే, గూగుల్ మ్యాప్స్ వల్ల మరో తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. నవంబర్ 24న అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి ఒక కారు పడిపోయిన విషయం తెలిసిందే. తాజా ఘటన వివరాల్లోకి వెళితే, ముగ్గురు వ్యక్తులు తెల్లటి టాటా టిగోర్ సెడాన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ వైపు వెళ్తున్నారు. నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి ఈ ముగ్గురూ బరేలీలోని బడా బైపాస్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. యాప్ వారికి రెండు రూట్ ఆప్షన్‌లను అందించింది. అందులో ఒకటి బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారి గుండా కాగా, మరొకటి షార్ట్ కట్ ద్వారా సమీపంలోని గ్రామం ద్వారా. అయితే, కార్లోని ముగ్గురూ షార్ట్ కట్ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లగా బర్కాపూర్ గ్రామ క్రాసింగ్ సమీపంలో రోడ్డు కోతకు గురికావడంతో కారు అదుపుతప్పి కాలాపూర్ కాలువలో పడింది.
నవంబర్ 24న ఏం జరిగింది?
అంతకుముందు నవంబర్ 24న జరిగిన సంఘటనలో, గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గూగుల్ మ్యాప్స్ వారిని ఒక అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిపైకి దారి చూపింది. వారు వేగంగా ఆ బ్రిడ్జిపై వెళ్తూ, వంతెనపై నుంచి రామగంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ చనిపోయారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) ఇంజనీర్లు మరియు గూగుల్ మ్యాప్స్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
గూగుల్ మ్యాప్స్ అంటే ఏమిటి?
గూగుల్ మ్యాప్స్ (Google Maps) అనేది నావిగేషన్‌లో సహాయం చేయడానికి గూగుల్ (Google) అందించే యాప్. యాపిల్ మరియు ఆండ్రాయిడ్ డివైజ్‌లలో రన్ అయ్యే ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే నావిగేషన్ అప్లికేషన్‌లలో ఒకటి. ఇది ట్రాఫిక్ పరిస్థితి, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రహదారి పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాలు అలాగే గమ్యస్థానానికి అంచనా వేసిన సమయంపై డేటాను అందిస్తుంది. ఈ యాప్ వేగ పరిమితులు, నిర్మాణంలో ఉన్న రోడ్లు, ఇతర విషయాలతోపాటు ప్రమాదాలు వంటి కీలకమైన రహదారి సమాచారాన్ని కూడా అందిస్తుంది. వాహన యజమానులు తమ గమ్యస్థానాలకు సజావుగా నావిగేట్ చేయడానికి తరచుగా Android Auto మరియు Apple CarPlay ద్వారా Google Mapsని ఉపయోగిస్తారు.