Camel flu Qatar : ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ వెళుతున్నారా? అయితే జాగ్రత్త!
27 November 2022, 7:55 IST
Camel flu Qatar : కొవిడ్ సంక్షోభం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది 2022 ఫిఫా వరల్డ్ కప్. వరల్డ్ కప్ చూసేందుకు ఖతార్ వెళ్లాలని భావిస్తున్నారా? అయితే.. వివిధ వ్యాధులు మీకు స్వాగతం పలికే ప్రమాదం ఉంది!
ఖతార్‌లో.. ఓ మెస్సీ అభిమాని
Camel flu Qatar : 2022 ఫిఫా వరల్డ్ కప్‌ను చూసేందుకు లక్షలాది మంది ప్రజలు.. ఖతార్‌కు తరలివెళుతున్నారు. ఈ క్రమంలో.. ఖతార్‌కు వెళ్లాలని భావిస్తున్న వారందరికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధారిత పరిశోధకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖతార్‌కు వెళితే.. వినోదంతో పాటు కొవిడ్, మంకీపాక్స్ వంటి రోగాలు కూడా సోకుతాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రమాదకరమైన 'కామెల్ ఫ్లూ' కూడా సోకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
జాగ్రత్తగా ఉండండి.. లేదంటే..!
ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో.. న్యూ మైక్రోబ్స్ అండ్ న్యూ ఇన్ఫెక్షన్స్ జర్నల్‌లో ఓ అధ్యాయనం ఇటీవలే ప్రచురితమైంది. ఖతార్‌లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటంతో.. వివిధ రోగాలు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆటగాళ్లు, అభిమానులు, స్థానికులకు ఇది మంచిది కాదని సూచిస్తున్నారు.
2022 FIFA world cup Qatar : ఈ కామెల్ ఫ్లూను ఎమ్‌ఈఆర్‌ఎస్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) అని కూడా పిలుస్తున్నారు. కొవిడ్లాగానే.. ఇది కూడా భవిష్యత్తులో మహమ్మారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే హెచ్చరించింది. ఖతార్‌కు సరిహద్దు దేశమైన సౌదీ అరేబియాలో.. 2012లో తొలిసారిగా ఈ ఎమ్ఈఆర్ఎస్ను గుర్తించారు. అప్పటి నుంచి 2600 కేసులు వెలుగులోకి వచ్చాయి. 27 దేశాల్లో 935మంది మరణించారు. జ్వరం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు, దగ్గు వంటివి సాధారణ లక్షణాలుగా ఉన్నాయి.
ఖతార్‌కు వెళుతున్న ప్రజలు.. అక్కడి ఒంటెలను ముట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒంటెల నుంచే ఈ కామెల్ ఫ్లూ పుట్టుకొచ్చిందని వారు చెబుతున్నారు.
కామెల్ ఫ్లూ, కొవిడ్‌తో పాటు.. లెష్మనైసిస్, డెంగ్యూ, రేబీస్, మీజిల్స్, హెపటైటిస్ ఏ,బీ, డయేరియా వంటి రోగాల బారిన కూడా ప్రజలు పడే ప్రమాదం ఉందని పరిశోధకులు అంటున్నారు.
ఖతార్‌కు.. 1.2మిలియన్ మంది!
Camel flu FIFA world cup : 2022 ఫిఫా వరల్డ్ కప్‌ను చూసేందుకు.. ప్రపంచ నలుమూలల నుంచి 1.2మిలియన్ మంది ఖతార్‌కు ప్రయాణిస్తారని అంచనా. ఇప్పటికే ఈ గల్ఫ్ నేషన్‌లో 2.8మిలియన్ మంది ప్రజలు నివాసముంటున్నారు. కొవిడ్ తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యల్లో ప్రజలు పోటీపడతారని, ఫలితంగా రోగాలకు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనే విధంగా.. తన ఆరోగ్య వ్యవస్థను ఖతార్ రూపొందించుకుందని.. కానీ నిరంతర నిఘా, పరిశోధనలు చేస్తేనే ఫలితం దక్కుతుందని స్టెడీ పేర్కొంది. ఖతార్‌కు వెళ్లే వారు.. తరచూ టీకాలు తీసుకోవాలని, ఫుడ్- డ్రింక్స్‌ను తీసుకునే ముందు జాగ్రత్త వహించాలని సూచించింది.