తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fake Sbi Branch: ఈ క్రిమినల్స్ వేరే లెవెల్; ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు..

Fake SBI branch: ఈ క్రిమినల్స్ వేరే లెవెల్; ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు..

Sudarshan V HT Telugu

03 October 2024, 14:57 IST

google News
    • నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ను తెరిచి, అందులో రిక్రూట్మెంట్స్ చేపట్టి, నిరుద్యోగులను మోసం చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. నేరస్తులు ఇక్కడ ఏకంగా ఎస్బీఐ బ్రాంచ్ నే ఓపెన్ చేసి, నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, వారికి ఆ బ్రాంచ్ లోనే జాబ్స్ ఇచ్చారు. వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు
ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు (Reuters)

ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు

ఛత్తీస్ గఢ్ లోని శక్తి జిల్లాలో నేరస్తులు ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నకిలీ బ్రాంచ్ నే ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ లో పెద్ద ఎత్తన మోసాలకు తెగబడ్డారు. బ్యాంక్ లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేశారు. వారికి అదే బ్యాంక్ లో నకిలీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

చత్తీస్ గఢ్ లో..

చత్తీస్ గఢ్ లోని మల్కరౌడా పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపోరా గ్రామంలో సెప్టెంబర్ 18 నుంచి ఈ ఎస్బీఐ (SBI) నకిలీ బ్రాంచ్ పనిచేస్తోంది. ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని మరీ వీరు ఈ నకిలీ బ్రాంచ్ ను నడిపారు. వేరే ఎస్బీఐ బ్రాంచ్ లో ఉండే మాదిరిగా ఎస్బీఐ లోగోతో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇందులోకి వెళ్తే సాధారణ బ్యాంక్ లాగానే సెటప్ ఉంటుంది. అయితే, బ్యాంక్ లావాదేవీలతో పాటు వీరు ప్రధానంగా నకిలీ రిక్రూట్మెంట్ పై దృష్టి పెట్టారు. నిరుద్యోగుల వద్ద నుంచి బ్యాంక్ జాబ్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారు. వారికి అదే బ్రాంచ్ లో ట్రైనింగ్ కూడా ఇవ్వసాగారు.

స్థానికుల ఫిర్యాదుతో..

అయితే, ఈ బ్యాంక్ తీరుపై స్థానికులకు అనుమానం వచ్చింది. వారు ఈ నకిలీ బ్రాంచ్ పై వేరే ఎస్బీఐ బ్రాంచ్ లో ఫిర్యాదు చేశారు. దాంతో, కోర్బాలోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన బృందం తనిఖీలు నిర్వహించి అది నకిలీదని నిర్ధారించింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్రాంచ్ పై దాడి చేసి కంప్యూటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ శాఖలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను ఇంటర్వ్యూల ద్వారా రిక్రూట్ చేసుకున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని ఏఎస్పీ రమా పటేల్ తెలిపారు.

కేసు నమోదు

బ్రాంచ్ మేనేజర్ గా నటించిన సూత్రధారి సహా ముగ్గురు ఆపరేటర్లపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. ఈ బ్రాంచ్ లో ఉద్యోగాల పేరిట ఎంతమందిని మోసం చేశారు, ఎంత డబ్బు వసూలు చేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

2020 లో తమిళనాడులో..

2020లో కడలూరు జిల్లా పన్రుతిలో నకిలీ ఎస్బీఐ (state bank of india) బ్రాంచ్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్బీఐ మాజీ ఉద్యోగి కుమారుడైన కమల్ బాబు కంప్యూటర్లు, లాకర్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసపూరిత శాఖను ఏర్పాటు చేశాడు. లాక్ డౌన్ సమయంలో ఈ బ్రాంచ్ పనిచేసింది, కానీ ఒక ఎస్బీఐ కస్టమర్ పట్టణంలో ఇప్పటికే ఉన్న బ్రాంచ్ మేనేజర్ ను దీని గురించి ఆరా తీయడంతో ఈ విషయం బహిర్గతమైంది.

తదుపరి వ్యాసం