BITS Pilani in Bengaluru: విద్యార్థులకు శుభవార్త; బెంగళూరులో బిట్స్ పిలానీ బ్రాంచ్
బెంగళూరులో బిట్స్ పిలానీ సెంటర్ ప్రారంభమైంది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే ఔట్ లో బిట్స్ పిలానీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని హజిల్ హబ్ స్పాన్సర్ చేస్తోంది.
భారత్ లో నాణ్యమైన విద్యను అందించే ప్రముఖ విద్యా సంస్థల్లో బిట్స్ పిలానీ ఒకటి. బిట్స్ పిలానీలో విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ లకు బిట్స్ పిలానీ అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పుడు తాజాగా, బిట్స్ పిలానీ (BITS Pilani) తన బెంగళూరు బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
బెంగళూరులోనే ఎక్కువ మంది పూర్వ విద్యార్థులు
బెంగళూరు (bengaluru)లో 800 మందికి పైగా పూర్వ విద్యార్థులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క నగరంలోనూ ఈ స్థాయిలో పూర్వ విద్యార్థులు లేరు. ఈ నేపథ్యంలో, బెంగళూరులో బిట్స్ పిలానీ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. బెంగళూరు లోని హెచ్ ఎస్ ఆర్ లేఅవుట్ లో ఉన్న కొత్త సెంటర్ ను నగరంలోని ఎంటర్ ప్రైజ్, కోవర్కింగ్ ఆఫీస్ స్పేస్ ల అతిపెద్ద ప్రొవైడర్లలో ఒకటైన హస్టెల్ హబ్ స్పాన్సర్ చేసింది. అంతేకాక, ఈ సంస్థ పూర్వ విద్యార్థులు, ఇతర విద్యార్థుల నేతృత్వంలోని సంస్థలతో సహా కార్పొరేట్ కమ్యూనిటీతో సహకారం పొందుతోంది.
కార్పొరేట్ కమ్యూనిటీ సహకారంతో..
ప్రాక్టీస్ స్కూల్, ప్లేస్మెంట్ స్టేషన్లతో పాటు పరిశ్రమ-ప్రాయోజిత పరిశోధన, కన్సల్టెన్సీ ప్రాజెక్టులను పొందడం వంటి సహకారాన్ని బెంగళూరులోని కార్పొరేట్ కమ్యూనిటీ సహకారంతో పొందగలమని బిట్స్ పిలానీ (BITS Pilani) భావిస్తోంది. ఇందుకు తమ పూర్వ విద్యార్థులు ఉపయోగపడ్తారని ఆశిస్తోంది. అదే సమయంలో బిట్స్ పిలానీ సంస్థ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించి విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధం చేయాలని భావిస్తోంది.
ప్రొఫెసర్ మృదులా గోయల్ నేతృత్వంలో..
బిట్స్ పిలానీ బెంగళూరు సెంటర్ కు గోవాలోని కేకే బిర్లా క్యాంపస్ కు చెందిన ప్రొఫెసర్ మృదులా గోయల్ నేతృత్వం వహిస్తారని, పూర్వ విద్యార్థుల వ్యవహారాల విభాగం, ఇన్ స్టిట్యూట్ ఇంక్యుబేషన్ సొసైటీల సహకారం ఉంటుందని తెలిపారు. బిట్స్ పిలానీ (BITS Pilani) వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ వి.రాంగోపాల్ రావు మాట్లాడుతూ ఇన్నోవేషన్, ఇండస్ట్రీ సహకారాన్ని పెంపొందించాలన్న సంస్థ సంకల్పానికి బెంగళూరు కేంద్రం నిదర్శనమన్నారు. ‘‘బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం స్థానిక సమాజంతో మా సంబంధాలను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించే డైనమిక్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి, వర్ధమాన పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు రూపొందించడానికి మాకు సహాయపడుతుంది’’ అని ప్రొఫెసర్ రావు అన్నారు. బిట్స్ గోవా ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సొసైటీ వ్యవస్థాపక నాయకురాలు ప్రొఫెసర్ మృదులా గోయల్ మాట్లాడుతూ ఇన్ స్టిట్యూట్ కార్యక్రమాలకు వెన్నెముకగా నిలిచిన పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.