తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump : డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో కాల్పుల కలకలం! మాజీ అధ్యక్షుడి చెవికి గాయం- లైవ్​ వీడియో..

Donald Trump : డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో కాల్పుల కలకలం! మాజీ అధ్యక్షుడి చెవికి గాయం- లైవ్​ వీడియో..

Sharath Chitturi HT Telugu

14 July 2024, 6:35 IST

google News
    • Donald Trump rally : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో కాల్పుల కలకలం! ట్రంప్​ చెవికి గాయమైంది. ఆయన్ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఆందోళనకర పరిణామం! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో భారీ శబ్దాలు వినిపించాయి. అవి తుపాకీ కాల్పుల శబ్దాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్​ని సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్లు రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. కానీ ట్రంప్​కి అప్పటికే గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన చెవి నుంచి రక్తం కారుతున్న ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

నవంబర్​లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికెన్​ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇటీవలి కాలంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఒక ర్యాలీ నిర్వహించారు. ఆయన స్టేజ్​ మీదకు వచ్చిన కొద్దిసేపటికే భారీ శబ్దాలు వినిపించాయి. ఇవి తుపాకీ కాల్పుల శబ్దాలని తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు శబ్దాల అనంతరం ట్రంప్​ నేలకొరిగారు. సీక్రెట్​ సర్వీస్​ ఏజెంట్లు స్టేజ్​ మీదకు పరుగులు తీశారు. ఆయన్ని రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్టేజ్​ దిగుతూ..  పిడికిలి బిగించిన తన చెయ్యిని పైకి చూపించారు. 'నన్ను ఎవ్వరు ఏం చెయ్యలేరు,' అన్నట్టు సైగ చేశారు ట్రంప్​.

కాగా ఈ ఘటనకు సంబంధించి ర్యాలీ ప్రాంగణంలో ఇద్దరు మరణించారని, వారిలో అనుమానిత షూటర్​ కూడా ఉన్నాడని అమెరికా మీడియా చెబుతోంది.

మరోవైపు ఈ వ్యవహారంపై సీక్రెట్​ సర్వీస్​ ఎక్స్​లో పోస్ట్​ చేసింది.

"మాజీ అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు ఇది మా చేతుల్లో ఉంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము," అని సీక్రెట్​ సర్వీస్​ పేర్కొంది.

ఈ ఘటనపై ట్రంప్​ తనయుడు ట్రంప్​ జూనియర్​ సైతం స్పందించారు. తన తండ్రి అమెరికా కోసం పోరాడుతూనే ఉంటారని అన్నారు.

ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఖండించిన అమెరికా అధ్యక్షుడు..

డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో హింస గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు అధికారులు వివరాలు ఇచ్చారు. ట్రంప్​ సురక్షితంగా ఉన్నారని చెప్పారు.

"పెన్సిల్వేనియాలో జరిగిన డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో హింసపై నాకు సమాచారం అందింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ట్రంప్​, ఆయన కుటుంబం, ర్యాలీలో పాల్గొన్న ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను. అమెరికాలో ఇలాంటి హింసకు చోటు లేదు. మనం అందరం ఐకమత్యంతో ఈ ఘటనని ఖండించాలి," అని బైడెన్​ ట్వీట్​ చేశారు.

డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో ఘటనకు సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి :

అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్​ ఒబామా సైతం ఈ ఘటనపై స్పందించారు.

"ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు చోటు లేదు. అసలు ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్​ సురక్షితంగా ఉన్నారన్న వార్త రిలీఫ్​ని ఇస్తుంది. ఆయన వేగంగా కోలుకోవాలని నేను, మిచెల్​(ఒబామా భార్య) ప్రార్థిస్తున్నాము," అని ఒబామా ట్వీట్ చేశారు.

తదుపరి వ్యాసం