Kangana Ranaut: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను బెంగళూరుకు ట్రాన్స్ ఫర్ చేశారా?
03 July 2024, 19:07 IST
ఏర్ పోర్ట్ లో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ గుర్తుందా? ఆమెకు సంబంధించి మరో కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సస్పెన్షన్ ను తొలగించి, తిరిగి బెంగళూరు విమానాశ్రయంలో విధుల్లో చేరాలని ఆదేశించారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
Kulwinder Kaur, the CISF constable who slapped Kangana Ranaut
Kangana Ranaut: గత నెలలో చండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ పై మరో వార్తాకథనం వైరల్ అవుతోంది. ఆమెను ఇప్పుడు బెంగళూరు విమానాశ్రయంలో తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సీఐఎస్ఎఫ్ వివరణ ఇచ్చింది.
సోషల్ మీడియాలో..
నటి, ఎంపీ కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టి సస్పెన్షన్ కు గురైన కుల్విందర్ కౌర్ ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారని, ఆమెను బెంగళూరుకు బదిలీ చేశారని ఏషియానెట్ వార్తను రెడిట్ యూజర్ ఒకరు షేర్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వెలువడుతున్నాయి. కుల్విందర్ కౌర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని, సాయుధ దళాల్లో పని చేసే వారు క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉందని కొందరు యూజర్లు వాదిస్తున్నారు. మరోవైపు, ఒక మంచి కారణంతో ఆమె కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టారని, రైతుల పోరాటానికి ఆమె ఆ విధంగా సపోర్ట్ చేశారని, రైతు ఉద్యమాన్ని అవమానపర్చిన కంగనా రనౌత్ (Kangana Ranaut) కు అది సరైన శిక్షేనని మరి కొందరు యూజర్లు అభిప్రాయపడ్తున్నారు. సీఐఎస్ఎఫ్ (CISF) కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నెటిజన్ల వాదనలు
కంగనాకు మద్దతుగా ఒక నెటిజన్ ‘‘ఒక సెలబ్రిటీని అలా ట్రీట్ చేస్తే అధికారం, డబ్బు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి’’ అని కామెంట్ చేశాడు. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని, రేపు ఆర్మీ సిబ్బంది వ్యక్తిగత అభిప్రాయాల కోసం హింసను ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ఆ నెటిజన్ ప్రశ్నించారు. అందువల్ల సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను విధుల్లో నుంచి తొలగించాలని కోరారు. హోదాతో సంబంధం లేకుండా ఎవరినీ చెంపదెబ్బ కొట్టే హక్కు, తాకే హక్కు ఎవరికీ లేదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఈ వాదన నిజమేనా?
కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన కాన్ స్టేబుల్ కుల్విందర్ కౌర్ ను తిరిగి విధుల్లోకి తీసుకుని, బెంగళూరు ఏర్ పోర్ట్ కు బదిలీ చేశారన్న వార్తలపై సీఐఎస్ఎఫ్ స్పందించింది. ఆ వార్త సరైనది కాదని, అది తప్పుడు వార్త అని స్పష్టం చేసింది. కుల్వీందర్ కౌర్ ఇంకా సస్పెన్షన్ లోనే ఉందని, ఆమెపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వివరణ ఇచ్చింది.
రెడిట్ పోస్ట్ ప్రామాణికత
రెడిట్ (Reddit) పోస్ట్ ప్రామాణికతను కూడా నెటిజన్లు ప్రశ్నించారు. పోస్ట్ ను అనుమతించే ముందు వాస్తవాలను తనిఖీ చేయనందుకు మోడరేటర్ ది తప్పు అన్నారు. ఇది ఫేక్ న్యూస్ అంటూ మరొకరు కామెంట్ చేశారు.