Kangana Ranaut: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గురించి ఈ వివరాలు తెలుసా?-kulwinder kaur 7 things to know about cisf constable who slapped kangana ranaut ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kangana Ranaut: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గురించి ఈ వివరాలు తెలుసా?

Kangana Ranaut: కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గురించి ఈ వివరాలు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Jun 07, 2024 04:42 PM IST

చండీగఢ్ విమానాశ్రయంలో గురువారం బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ జవాను కుల్వీందర్ కౌర్ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఆమెపై సీఎస్ఐఎఫ్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. మరో వైపు, ఆమెకు వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది.

కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ జవాను కుల్వీందర్ కౌర్
కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ జవాను కుల్వీందర్ కౌర్ (@SaffronSunanda)

చండీగఢ్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ను చెంపదెబ్బ కొట్టారు. రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ తీరుకు నిరసనగానే తాను కంగనా ను చెంపదెబ్బ కొట్టానని కుల్వీందర్ కౌర్ చెప్పారు. కాగా, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కుల్విందర్ కౌర్ ను సస్పెండ్ చేశారు. అంతేకాదు, ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెపై సీఐఎస్ఎఫ్ అంతర్గత విచారణ కూడా జరపనుంది.

కంగనా రనౌత్ స్పందన

తనను సీఐఎస్ఎఫ్ జవాను చెంపదెబ్బ కొట్టిన విషయాన్ని కంగనా రనౌత్ ధ్రువీకరించారు. సెక్యూరిటీ చెక్ వద్ద ఈ ఘటన జరిగిందని వివరించారు. ‘‘ఆ కానిస్టేబుల్ ఒక వైపు నుంచి నా వైపు వచ్చింది. అకస్మాత్తుగా ఆమె నా ముఖంపై కొట్టి, తిట్టడం మొదలుపెట్టింది’’ అని కంగనా వివరించింది. ఎందుకు కొట్టావని తాను ప్రశ్నించగా, రైతు ఉద్యమానికి మద్దతుగా అని ఆమె సమాధానమిచ్చిందని కంగనా ఒక వీడియోలో వివరించారు. పంజాబ్ లో పెరుగుతున్న ఉగ్రవాద ధోరణులపై కంగనా ఆందోళన వ్యక్తం చేశారు.

కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఏమన్నారు?

ఈ ఘటన తర్వాత కుల్వీందర్ కౌర్ అక్కడున్న వారితో తన వాదన వినిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో రైతు ఉద్యమం సమయంలో, నెలల తరబడి ధర్నాలో కూర్చున్న రైతుల గురించి గతంలో కంగనా రనౌత్ అవమానకరంగా మాట్లాడిందని, ఆ ధర్నాలో తన తల్లి కూడా కూర్చుందని కుల్వీందర్ కౌర్ వివరించారు. ‘‘రైతులకు రూ.100, రూ.200 ఇవ్వడం వల్లే రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు’’ అని గతంలో రైతు ఉద్యమం సందర్భంగా కంగనా రనౌత్ ఒక ప్రకటన చేశారు. ఆ కామెంట్ కు ప్రతిస్పందనగానే తాను కంగనా రనౌత్ ను కొట్టానని కుల్వీందర్ స్పష్టం చేశారు.

సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వివరాలు

కాగా, కంగనా రనౌత్ ను చెంప దెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాను కుల్వీందర్ కౌర్ ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు.

  • కుల్విందర్ కౌర్ 2009లో సీఐఎస్ఎఫ్ లో చేరారు. 2021 నుండి చండీగఢ్ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ లో ఉన్నారు.
  • కుల్వీందర్ కౌర్ పంజాబ్ లోని సుల్తాన్ పూర్ లోధికి చెందిన ఒక రైతు కుటుంబానికి చెందిన 35 ఏళ్ల మహిళ.
  • గత మూడేళ్లుగా ఆమె చండీగఢ్ విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్నారు.
  • ఆమె భర్త కూడా సీఐఎస్ఎఫ్ లో జవానుగా చండీగఢ్ విమానాశ్రయంలోనే విధుల్లో ఉన్నారు.
  • ఆమె సోదరుడు షేర్ సింగ్ స్థానిక రైతు నాయకుడు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సంస్థాగత కార్యదర్శి.
  • కుల్విందర్ కౌర్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
  • విధి నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఆమెపై ఎలాంటి విజిలెన్స్ విచారణ జరగలేదని, శిక్ష పడలేదని అధికారులు తెలిపారు.