Kangana Ranaut: కంగనా రనౌత్ చెంప చెళ్లుమనిపించిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాను
నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ను చండీగఢ్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన మహిళా జవాను చెంపదెబ్బ కొట్టారు. ఏర్ పోర్ట్ లో నిబంధనలు పాటించకుండా, దుందుడుకుగా వ్యవహరించడంతో కంగనా చెంప చెళ్లుమనిపించారు.
నటి, రాజకీయ నాయకురాలు, ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ కు గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో అనూహ్య అవమానం ఎదురైంది. విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కు చెందిన మహిళా జవాను ఒకరు కంగనాను
చెంపదెబ్బ కొట్టారు. విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో నటి, ఎంపీ కంగనా రనౌత్ తన ఫోన్ ను ట్రేలో పెట్టడానికి నిరాకరించడంతో పాటు భద్రతా సిబ్బందిని నెట్టివేశారు. దాంతో, అక్కడ విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ కు చెందిన మహిళా జవాను కంగనా చెంపపై గట్టిగా కొట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం, కంగనా రనౌత్ మధ్యాహ్నం 3 గంటలకు విస్తారా విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
75 వేల మెజారిటీతో గెలుపు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాని మోదీకి గట్టి మద్ధతుదారు. మోదీని, బీజేపీని ప్రశంసిస్తూ పలు సందర్భాల్లో ఆమె బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దాంతో, ఆమెకు బీజేపీ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కంగనా రనౌత్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ను ఆమె 74,755 ఓట్ల తేడాతో ఓడించారు. రాజకీయ నాయకురాలిగా తన తొలి లోక్ సభ ఎన్నికల్లో కంగనా రనౌత్ కు 5,37,022 ఓట్లు వచ్చాయి. మొత్తం 13,77,173 మంది ఓటర్లు ఉన్న మండీ లోక్ సభ స్థానంలో పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
17 ఏళ్లకే సినిమాల్లోకి..
2006లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన 'గ్యాంగ్ స్టర్' చిత్రంతో 17 ఏళ్ల వయసులోనే నటనారంగ ప్రవేశం చేసిన కంగనా రనౌత్ 'క్వీన్', 'తను వెడ్స్ మను' 'తను వెడ్స్ మను రిటర్న్స్', 'మణికర్ణిక', 'ఫ్యాషన్', 'పంగా' తదితర చిత్రాల్లో తన నటనతో ప్రశంసలు అందుకుంది. 2019 లో పౌరసత్వ (సవరణ) చట్టం, రైతుల నిరసనలు వంటి అంశాలపై కంగనా రనౌత్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ మద్దతుదారుగా ఉన్నారు. అయోధ్య రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారు.