Arvind Kejriwal: ‘‘పంజరంలో చిలుకను కాదు’’ అని నిరూపించుకోవాలి: సీబీఐపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
13 September 2024, 14:37 IST
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీబీఐ స్వతంత్రతపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర దర్యాప్పు సంస్థపై ఉన్న ‘పంజరంలో చిలుక’ ముద్రను తొలగించుకోవాలని ఆయన సూచించారు.
సీబీఐకి సుప్రీంకోర్టు చురకలు
Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేయడానికి చూపిన కారణంపై అనుమానాలు వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు బెయిల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 11 నుంచి జైలులో ఉన్నారు. తన బెయిల్ దరఖాస్తును ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 13, శుక్రవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐ పై పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.
పంజరంలో చిలుకను కాదని నిరూపించుకోవాలి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐ తీరును ప్రశ్నించారు. సీబీఐ పై సమాజంలో ఉన్న ‘పంజరంలో ఉన్న చిలుక’ అన్న అభిప్రాయాన్ని తొలగించుకునేలా వ్యవహరించాలని ఆయన సూచించారు. సీబీఐ అంటే పంజరంలో చిలుక కాదని నిరూపించుకోవాలన్నారు. ‘సీబీఐ అనేది మచ్చలేని చిలుక అని చూపించాలి’ అని అన్నారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను ఉపయోగిస్తుంటాయి.
అంత అర్జెన్సీ ఏంటి?
లిక్కర్ స్కామ్ (liquor scam) కు సంబంధించిన ఈడీ కేసులో విడుదలకు సిద్ధంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం సీబీఐకి ఏంటో తనకు అర్థం కాలేదని సుప్రీంకోర్టు (SUPREME COURT) న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఒకే కేసులో, అవే ఆరోపణలతో ఈడీ నుంచి బెయిల్ వచ్చినప్పటికీ.. సీబీఐ ఆయనను అరెస్ట్ చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్ని సీబీఐ సమర్థించలేకపోయిందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తేల్చి చెప్పారు.
బెయిల్ ను అడ్డుకునేందుకే అరెస్ట్
విచారణ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ఇచ్చిన సమాధానాలను కారణంగా చూపుతూ ఆయనను సీబీఐ అరెస్ట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. విచారణకు సహకరించకపోవడం అంటే, నేరాన్ని అంగీకరించినట్లు కాదని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా సీబీఐ (CBI) ఆయనను అరెస్టు చేసిందని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.