Bill Gates: ‘ఇండియాను ఒక ప్రయోగశాలగా ఉపయోగిస్తున్నా’: బిల్ గేట్స్; మండిపడుతున్న భారతీయులు
03 December 2024, 14:52 IST
Bill Gates: తన ఆలోచనలకు, ప్రయత్నాలకు ఒక ప్రయోగశాలగా భారతదేశాన్ని వాడుతున్నానని ఒక పాడ్ కాస్ట్ లో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. వాతావరణ మార్పులు, ఇంధనం, ప్రపంచ ఆరోగ్యం, విద్య గురించి మాట్లాడుతూ గేట్స్ పై వ్యాఖ్యలు చేశారు.
బిల్ గేట్స్
Bill Gates: రీడ్ హాఫ్ మన్ తో బిల్ గేట్స్ ఇటీవల చేసిన ఒక పాడ్ కాస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది. కానీ అందులో తాను భారతదేశాన్ని "వివిధ అంశాలను పరిశీలించడానికి ఒక రకమైన ప్రయోగశాల"గా ఉపయోగిస్తున్నానని బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యపై భారతీయులు మండిపడుతున్నారు. ఆయన భారతదేశాన్ని, భారతీయులను అవమానించారని నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తన వ్యాఖ్యలను గేట్స్ వెనక్కు తీసుకుని, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ బిల్ గేట్స్ ఏమన్నారంటే.
‘‘రత్ లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో ఆరోగ్యం, పోషకాహారం, విద్య ముఖ్యమైనవి. అయితే, గత కొన్నేళ్లుగా భారత్ ఈ రంగాల్లో మెరుగుపడుతోంది. సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నాయి. 20 ఏళ్ల తర్వాత భారతదేశంలో ప్రజలు మరింత మెరుగుపడతారు. ఆయా అంశలను నిశితంగా పరిశీలించడానికి భారత్ ఒక ప్రయోగశాల లాంటిది. దేశంలో ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య మెరుగుపడుతున్నాయి, కానీ, అక్కడ ఇంకా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. భారత్ లో ఈ విషయాలను అధ్యయనం చేసి, వాటిని ఇతర దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు’’ అని బిల్ గేట్స్ ఆ పాడ్ కాస్ట్ లో అన్నారు. అందుకే, అమెరికా తరువాత, తమ ఫౌండేషన్ కు చెందిన అతిపెద్ద కార్యాలయం భారత్ లోనే ఉందని బిల్ గేట్స్ తెలిపారు. అలాగే, తమ ఫౌండేషన్ ద్వారా అత్యధిక పైలట్ ప్రాజెక్టులు భారతదేశంలోనే కొనసాగుతున్నాయని వెల్లడించారు.
నెటిజన్ల స్పందన
బిల్ గేట్స్ వ్యాఖ్యలపై భారతీయులు సోషల్ మీడియా (social media) వేదికలపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బిల్ గేట్స్ కు భారత్ ఒక ప్రయోగశాల. మనం భారతీయులం బిల్ గేట్స్ కు గినియా పిగ్స్. ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాల వరకు, మీడియా వరకు అందరినీ మేనేజ్ చేశారు ఈ వ్యక్తి. ఎఫ్ సీఆర్ ఏ లేకుండానే ఆయన కార్యాలయం ఇక్కడ పనిచేస్తోంది. మన విద్యావిధానం ఆయనను హీరోను చేసింది. మనం ఎప్పుడు మేల్కొంటామో తెలీదు!’’ అని ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
గేట్స్ తప్పేం లేదు..
అయితే, మైక్రోసాఫ్ట్ (microsoft) సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ పై విమర్శలు అనవసరమని కొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆయన భారత్ ను ప్రశంసించారని వాదిస్తున్నారు. 'భారత్ లో బిల్ గేట్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్ర సిద్ధాంత వైఖరిని నేను నిజంగా అర్థం చేసుకోలేను. భారత్ తో వ్యాక్సిన్ల (vaccine) కోసం గినియా పిగ్ తరహా ప్రయోగాలు జరగడం లేదు’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా, పోషకాహార లోపం సమస్య పరిష్కారంపై భారత్ దృష్టి సారించిందని గతంలో ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ కొనియాడారు. ఈ విషయంలో భారత దేశం చేస్తున్న కృషికి 'ఎ' రేటింగ్ ఇస్తానని చెప్పారు.