Web Series: బిల్ గేట్స్‌కు బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఇది.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు
Web Series: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ సమ్మర్ లో చూడటానికి, చదవడానికి తనకు నచ్చిన కొన్ని వెబ్ సిరీస్, పుస్తకాలను రిఫర్ చేశారు. మరి ఆయనకు బాగా నచ్చిన ఆ వెబ్ సిరీస్ ఏదో చూసేయండి.
Web Series: బిల్ గేట్స్ తన పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. పుస్తకాలు చదవడం, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చూడటం మాత్రం అస్సలు మిస్ చేయరు. అంతేకాదు ప్రతి ఏటా సమ్మర్ లో చదవాల్సిన బుక్స్, చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఏంటో కూడా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటారు. ఈసారి కూడా గేట్స్ కొన్ని పుస్తకాలను, ఓ వెబ్ సిరీస్ ను రికమెండ్ చేశారు.
బిల్ గేట్స్‌కు నచ్చిన వెబ్ సిరీస్
మైక్రోసాఫ్ట్ అధినేతగా, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా బిల్ గేట్స్ కు పేరుంది. అలాంటి వ్యక్తి ఏ స్థాయిలో బిజీగా ఉంటారో ఊహించుకోవచ్చు. కానీ అంతటి బిజీ షెడ్యూల్ లోనూ ఆయన పుస్తకాలు చదవడం మాత్రం మానరు. అంతేకాదు ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ కూడా చూస్తున్నారు. తాజాగా తనకు బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఏదో తన బ్లాగులో ఆయన చెప్పుకొచ్చారు.
బిల్ గేట్స్ కు నచ్చిన వెబ్ సిరీస్ స్లో హార్సెస్ (Slow Horses). ఇదొక బ్రిటీష్ వెబ్ సిరీస్. తనకు స్పై గేమ్, త్రీ డేస్ ఆఫ్ ద కాండోర్ సినిమాలు అంటే చాలా ఇష్టమని, ఈ స్లో హార్సెస్ సిరీస్ కూడా అలాంటిదే అని గేట్స్ తన బ్లాగులో రాశారు. ఇక ఈ సిరీస్ గురించి కూడా ఆయన వివరించారు. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ తనకు ఎందుకు నచ్చిందో చెప్పారు.
"ఇదొక బ్రిటీష్ సిరీస్. బ్రిటన్ సీక్రెట్ ఏజెన్సీ ఎంఐ5లో ఉన్నట్లుగా చూపించిన ఓ కల్పిత స్లావ్ హౌజ్ లో పని చేసే అండర్ కవర్ ఏజెంట్స్ చుట్టూ తిరుగుతుంది. గ్యారీ ఓల్డ్‌మ్యాన్ ఈ సిరీస్ లో ఈ స్లావ్ హౌజ్ హెడ్ గా నటించారు. జేమ్స్ బాండ్ కు పూర్తి విరుద్ధమైన పాత్ర ఇది" అని బిల్ గేట్స్ చెప్పారు. ఈ స్లో హార్సెస్ వెబ్ సిరీస్ ను ఇండియాలో అయితే ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలో చూడొచ్చు.
బిల్ గేట్స్ కు నచ్చిన పుస్తకాలు ఇవే
వెబ్ సిరీసే కాదు తనకు నచ్చిన పుస్తకాలు ఏవో కూడా ఇదే బ్లాగులో బిల్ గేట్స్ తెలిపారు. క్రిస్టిన్ హన్నా రాసిన ది వుమెన్.. క్రిస్ ఆండర్సన్ రాసిన ఇన్ఫెక్షస్ జెనరాసిటీ.. సాల్ ఖాన్ రాసిన బ్రేవ్ న్యూ వర్డ్స్.. డేవిడ్ బ్రూక్స్ రాసిన హౌ టు నో ఎ పర్సన్ అనే పుస్తకాలను గేట్స్ రికమెండ్ చేశారు. స్లో హార్సెస్ వెబ్ సిరీస్ చూడటంతోపాటు ఈ పుస్తకాలను చదవాల్సిందిగా ఆయన కోరారు.
గతేడాది కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న డానిష్ వెబ్ సిరీస్ బోర్జెన్ ను తాను చూసినట్లు గేట్స్ వెల్లడించారు. ఈ సిరీస్ కూడా తనకు బాగా నచ్చిందన్నారు. ఇదొక పొలిటికల్ డ్రామా అని, నాలుగు సీజన్లను వరుస పెట్టి చూసినట్లు కూడా చెప్పడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం.. గేట్స్ చెప్పినట్లు మీరు కూడా ఈ సిరీస్ లను చూసేయండి.