Solar Electric Car : గెట్ రెడీ.. భారత్‌లో మెుట్టమెుదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!
Solar Electric Car : భారత్‌లో మెుట్టమెుదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025లో దీనిని ప్రదర్శించనున్నట్టు సమాచారం.
ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 సమీపిస్తుండటంతో కార్ల బ్రాండ్స్, లాంచ్‌ల గురించి వార్తలు వస్తుంటాయి. ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 లో ఆసక్తికరమైన ఎంట్రీ జరగనుందని సమాచారం. ఎందుకంటే production-spec Vayve EVA సోలార్ కారును లాంచ్ చేయబోతోంది. పుణెకు చెందిన ఈ స్టార్టప్ గత ఏడాది ఆటో ఎక్స్ పోలో తన ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది.
భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు వస్తుంది. సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు ఇది. నగరాలు, ట్రాఫిక్ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న మైక్రో కారు. ఇది వాస్తవానికి త్రిచక్ర వాహనం, ముందు రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం ఉంటాయని తెలుస్తోంది.
దీన్ని మోటార్ సైకిల్ నుంచి త్రిచక్ర వాహనంగా మార్చారు. ఈ వాహనం చాలా తక్కువ స్థలంలో తిరగగలదు. ట్రాఫిక్ గుండా వెళ్ళడానికి ఎటువంటి సమస్య ఉండదు. ఈ వాహనం యజమానికి సులభమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. వైవే ఈవీఏ చాలా ఆసక్తికరమైన డిజైన్‌తో దీనిని తీసుకువస్తుంది.
ఇది ఎంజీ కామెట్‌ను పోలి ఉంటుందని అంటున్నారు. కామెట్ దాని చిన్న పరిమాణం, ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్‌తో మంచి అమ్మకాలను పొందగలిగింది. ఇది భారతదేశంలో మాస్ మార్కెట్ చిన్న బాడీ కార్ల విభాగానికి నాయకత్వం వహించింది. ఈవీఏ కూడా అదే మోడల్‌లో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎంజీ కామెట్ మాదిరిగా కాకుండా ఇది 3 సీటర్, ముందు భాగంలో సింగిల్ సీటు, వెనుక భాగంలో రెండు సీట్లతో వస్తుందని అంటున్నారు. రెండో ఫ్రంట్ సీటు లేకపోవడం వల్ల వెనుక వైపు సులువుగా లోపలికి వెళ్లేందుకు వెసులుబాటు కలిగి ఉంటుంది.
ఇది ఒక చిన్న లిక్విడ్-కూల్డ్ 14 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్, వాల్ సాకెట్ ద్వారా రీఛార్జ్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. ఇంట్లో ఏసీ ఛార్జింగ్‌కు నాలుగు గంటలు పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 45 నిమిషాల్లో 80 శాతం అవుతుంది. బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ రేంజ్ 250 కిలోమీటర్లు ఉంటుందని అంచనా.
ఇందులో అత్యంత ముఖ్యమైనది సోలార్ ఛార్జింగ్ ఆప్షన్. ఈ కారులోని సన్ రూఫ్ లో 150వాట్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. రేంజ్ పెరిగేందుకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఈవీఏలో మంచి ఫీచర్ రిచ్ క్యాబిన్ ఉండనుంది. వీటితో పాటు రివర్సింగ్ కెమెరా, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టూ స్పోక్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మోనోకాక్ ఛాసిస్, ఐపీ 68-రేటెడ్ పవర్ట్రెయిన్‌తో వస్తుంది.