Bangladesh violence : ‘కోటా’ హింసకు 32మంది బలి- పోలీసులనే పరిగెత్తిస్తున్న నిరసనకారులు..
19 July 2024, 6:34 IST
Bangladesh violence today : బంగ్లాదేశ్‌లో నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. నిరసనల్లో ఇప్పటివరకు 32మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్‌లో నిరసనలు.. (AFP)
బంగ్లాదేశ్‌లో నిరసనలు..
నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం తీసుకొచ్చిన 'కోటా'పై విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 32మంది ప్రాణాలు కోల్పోయారు!
నిరసనలు ఆపేయాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రధాని షేక్ హసీనా విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే, సందేశాన్ని ప్రకటించేందుకు ఆమె ఉపయోగించిన ప్రభుత్వ బ్రాడ్‌క్యాస్టర్ నెట్వర్క్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు!
బంగ్లాదేశ్‌లో హింస..
- ప్రభుత్వ ఉద్యోగాలకు కోటా వ్యవస్థ సంస్కరణలపై నిరసన వ్యక్తం చేస్తూ వందలాది మంది నిరసనకారులు అల్లర్లు చేపట్టారు. పోలీసులను చుట్టుముట్టారు. ఢాకాలోని బీటీవీ ప్రధాన కార్యాలయానికి పోలీసులను వెంబడించి ఛానల్ రిసెప్షన్ భవనం, నిలిపి ఉంచిన పలు వాహనాలకు నిప్పుపెట్టారు. కాగా కార్యాలయంలో పలువురు చిక్కుకున్నప్పటికీ వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
- ఈ ఘర్షణల్లో గురువారం ఒక్క రోజే 25 మంది మృతి చెందారు. 1971లో పాకిస్థాన్ నుంచి దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన యుద్ధ వీరుల బంధువులతో సహా ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని నిరసిస్తూ ఢాకా, ఇతర నగరాల్లోని విశ్వవిద్యాలయ విద్యార్థులు వారం రోజులకు పైగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
- ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయువు, శబ్ద గ్రెనేడ్లను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది.
- ఈ హింసాకాండతో రాజధానిలోని మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇంటర్నెట్ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ దాదాపు పూర్తిగా ఇంటర్నెట్ షట్‌డౌన్ ఎదుర్కొంటోందని సమాచారం.
- శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజధాని సహా దేశవ్యాప్తంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.
- పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను నిరవధికంగా మూసివేయాలని షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశించింది. బుధవారం ప్రధాని హసీనా బ్రాడ్క్యాస్టర్లో ప్రత్యక్షమై నిరసనకారుల ప్రవర్తనని ఖండించారు. బాధ్యులను శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే మరుసటి రోజే హింస మరింత ముదిరడం గమనార్హం.
- 1971లో పాకిస్థాన్‌తో జరిగిన విమోచన యుద్ధంలో పాల్గొన్న సైనికుల పిల్లలతో సహా ప్రభుత్వ ఉద్యోగాల్లో సగానికి పైగా నిర్దిష్ట సమూహాలకు రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టిన కోటా విధానానికి స్వస్తి పలకాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం హసీనాకు మద్దతు ఇచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని ఏఎఫ్పీ నివేదించింది. ఇదిలావుండగా, హసీనా ప్రభుత్వం వ్యతిరేకతను అణిచివేస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
- వదంతులు, అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్నారన్న బంగ్లాదేశ్ జూనియర్ మంత్రి జునైద్ అహ్మద్ పాలక్ ఇంటర్నెట్ నిషేధాన్ని సమర్థించుకున్నారు.
- నిరసన తెలుపుతున్న విద్యార్థులతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని న్యాయశాఖ మంత్రి అనిసుల్ హక్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్రధాని షేక్ హసీనా తనకు, విద్యాశాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరికి చర్చ బాధ్యతలు అప్పగించారన్నారు.
- ప్రభుత్వంతో, నజ్ముల్ హసన్ తో చర్చలను తాము కోరుకోవడం లేదని ఆందోళనకారుల ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేస్తూ వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.