IND vs PAK: లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఛాంపియ‌న్స్‌ ఓట‌మి - యువీ, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ విఫ‌లం-world championship of legends 2024 pakistan champions beat india champions by 68 runs wcl update ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Pak: లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఛాంపియ‌న్స్‌ ఓట‌మి - యువీ, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ విఫ‌లం

IND vs PAK: లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఛాంపియ‌న్స్‌ ఓట‌మి - యువీ, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ విఫ‌లం

Nelki Naresh Kumar HT Telugu
Jul 07, 2024 08:49 AM IST

IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్ చేతిలో 68 ప‌రుగుల తేడాతో ఇండియా టీమ్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగులు చేయ‌గా...ఇండియా 175 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్
ఇండియా వర్సెస్ పాకిస్థాన్

IND vs PAK: వరల్డ్ చాంపియన్‍షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియా టీమ్‌ను పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ ఓడించింది. ఏక‌ప‌క్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్థాన్ 68 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకున్న‌ది. పేల‌వ‌మైన బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌లో అంబటి రాయుడు, సురేష్ రైనా మిన‌హా మిగిలిన వారు రాణించ‌లేక‌పోవ‌డంతో ఇండియా ఛాంపియ‌న్స్ చేజేతులా ఓట‌మిని కొనితెచ్చుకున్న‌ది.

243 ప‌రుగులు...

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 243 ప‌రుగులు చేసింది.

పాకిస్థాన్ ఓపెన‌ర్లు క‌మ్రాన్ అక్మ‌ల్‌, షార్జిల్ ఖాన్ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగారు. క‌మ్రాన్ అక్మ‌ల్ 40 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 77 పరుగులు చేయ‌గా...షార్జిల్ ఖాన్ 30 బాల్స్‌లోనే ఏడు ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల‌తో 70 ర‌న్స్ చేశాడు. వీరిద్ద‌రి మెరుపుల‌తో ప‌ది ఓవ‌ర్ల‌లోనే పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ 145 ప‌రుగులు చేసింది.

మెరుపు హాఫ్ సెంచ‌రీ...

మ‌ఖ్సూద్ మెరుపు హాఫ్ సెంచ‌రీతో పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. మ‌ఖ్సూద్ ఇర‌వై ఆరు బాల్స్‌లోనే ఐదు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 51 ర‌న్స్ తో అద‌ర‌గొట్టాడు. షోయ‌బ్ మాలిక్ 18 బాల్స్‌లో 25 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

పాకిస్థాన్ ఛాంపియ‌న్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రీది మాత్రం తాను ఎదుర్కొన్న తొలి బంతికే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఇండియా ఛాంపియ‌న్స్ బౌల‌ర్ల‌లో ఆర్‌పీ సింగ్‌, ధావ‌ల్ కుల‌క‌ర్ణి, ప‌వ‌న్ నేగి, అనుప్రీత్‌సింగ్‌ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది.

ఆరంభం అదిరినా...

భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన ఇండియా ఛాంపియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 175 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. రాబిన్ ఉత‌ప్ప‌, సురేష్ రైనా, అంబటి రాయుడు ఇండియాకు అదిరే ఆరంభాన్ని అందించారు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫ‌లం కావ‌డంలో ఇండియా ఛాంపియ‌న్స్ ఓట‌మి పాలైంది.

రాబిన్ ఉత‌ప్ప 12 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు ఓ ఫోర్‌తో 22 ర‌న్స్ చేశాడు. అంబాటి రాయుడు 23 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 39 ర‌న్స్‌, సురేష్ రైనా న‌ల‌భై బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు చేశారు. వీరి ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో టీమిండియా ఎనిమిది ఓవ‌ర్ల‌లోనే 90 ప‌రుగులు చేసింది. రైనా, రాయుడు ఔట్ అయిన త‌ర్వాత ఇండియా ఛాంపియ‌న్స్ ప‌త‌నం మొద‌లైంది.

యువ‌రాజ్ సింగ్‌.. ఇర్ఫాన్ ప‌ఠాన్‌...

యూసుఫ్ ప‌ఠాన్ డ‌కౌట్ కాగా...కెప్టెన్ యువ‌రాజ్ సింగ్ 14, ఇర్ఫాన్ ప‌ఠాన్ 15 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. చివ‌ర‌లో మూడు సిక్స‌ర్ల‌తో అనుప్రీత్ సింగ్ మెరిపించిన అత‌డిపోరాటం స‌రిపోలేదు. 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు న‌ష్ట‌పోయి 175 ప‌రుగులు చేసిన ఇండియా ఛాంపియ‌న్స్ 68 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో వ‌హాబ్ రియాజ్‌, షోయ‌బ్ మాలిక్ త‌లో మూడు వికెట్లు తీసుకున్నారు.

Whats_app_banner