Akhtar on Team India: టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్-shoaib akhtar other former pakistan players congratulate team india for winning t20 world cup ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akhtar On Team India: టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్

Akhtar on Team India: టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్

Hari Prasad S HT Telugu
Jul 01, 2024 04:14 PM IST

Akhtar on Team India: టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్. షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిదిలాంటి వాళ్లు సోషల్ మీడియా ద్వారా విశ్వ విజేతలకు శుభాకాంక్షలు చెప్పారు.

టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్
టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ (Getty Images-PTI)

Akhtar on Team India: టీ20 వరల్డ్ కప్ ను రెండోసారి గెలిచిన టీమిండియాకు పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ శుభాకాంక్షలు చెప్పారు. షోయబ్ అక్తర్ తోపాటు షాహిద్ అఫ్రిది, వకార్ యూనిస్, సక్లైన్ ముస్తాక్, అహ్మద్ షెహజాద్ లాంటి వాళ్లు తమ ఎక్స్ అకౌంట్ల ద్వారా టీమిండియాతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించారు. ఈ మెగా టోర్నీ గెలవడానికి వాళ్లు పూర్తిగా అర్హులని అన్నారు.

yearly horoscope entry point

టీమిండియాపై పాక్ మాజీల ప్రశంసలు

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ ప్రారంభానికి ముందే ఈ కప్పు కచ్చితంగా టీమిండియానే గెలుస్తుందంటూ సౌతాఫ్రికాకు తన సానుభూతి తెలిపాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. అతడు చెప్పినట్లు గెలిచి రెండోసారి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. దీంతో దాయాది తరఫున గతంలో ఆడిన ప్లేయర్స్ నుంచి ఇప్పుడు ఇండియన్ టీమ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత షోయబ్ అక్తర్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ విజయానికి రోహిత్, టీమిండియా పూర్తిగా అర్హులని, నిజానికి గతేడాది కూడా వన్డే వరల్డ్ కప్ గెలవాల్సిందని అతడు అన్నాడు. "రోహిత్ శర్మ సాధించాడు. భావోద్వేగాలు ఓ స్థాయిలో ఉన్నారు. ఇండియా ఈ విజయానికి పూర్తి అర్హులు. వాళ్లకు శుభాకాంక్షలు. వాళ్లు అహ్మదాబాద్ లో ఓడిపోయారు. అప్పుడు కూడా ఇండియా గెలవాల్సిందని నేను అన్నాను. ఇప్పుడు వాళ్లు గెలిచారు. రోహిత్ శర్మ గ్రౌండ్ పై అలా పడుకొని ఏడ్చేశాడు. అతనికి అది ఎంత ముఖ్యమో దీనిని చూస్తేనే తెలుస్తుంది" అని అక్తర్ అన్నాడు.

బుమ్రా బెస్ట్ బౌలర్: అఫ్రిది

ఇక మరో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. "ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం సాధించిన ఇండియాకు శుభాకాంక్షలు. రోహిత్ దీనికి పూర్తిగా అర్హుడు. అతడో అత్యద్భుతమైన లీడర్. కోహ్లి ఎప్పుడూ పెద్ద మ్యాచ్ లలో ఆడతాడు. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. సౌతాఫ్రికాను దురదృష్టం వెన్నాడింది. వాళ్లు టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారు" అని అఫ్రిది అన్నాడు.

మరో మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్ కూడా స్పందించాడు. "కఠినమైన పరిస్థితుల్లో గొప్ప ప్లేయర్స్ బాగా ఆడతారు. విరాట్ కోహ్లి అలాగే ఆడాడు కానీ చివర్లో బుమ్రా వేసిన రెండు ఓవర్లు వరల్డ్ కప్ విన్నర్ అని చెప్పొచ్చు. టీమిండియా, రోహిత్ శర్మకు శుభాకాంక్షలు" అని వకార్ అన్నాడు.

మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ స్పందిస్తూ.. "గొప్ప లీడర్. అలాగే గొప్ప ప్లేయర్ కూడా. రోహిత్ శర్మ నీ విజయవంతమైన కెరీర్లో చాలా బాగా ఆడావు. వరల్డ్ కప్ గెలిచి ముగించడం చాలా కాలం గుర్తుండిపోతుంది" అని ట్వీట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన రోజే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. మరుసటి రోజు రవీంద్ర జడేజా టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే వీళ్లు వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగనున్నారు.

Whats_app_banner