Shoaib Akhtar on Team India: అసలుసిసలు ప్రతీకార విజయం అంటే ఇదీ: టీమిండియాపై షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం
Shoaib Akhtar on Team India: టీమిండియా, రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్. అసలుసిసలు ప్రతీకార విజయం అంటే ఇదీ అని అతడు అనడం విశేషం.
Shoaib Akhtar on Team India: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియాపై పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ఇప్పుడు ఇండియా ప్రతీకారం తీర్చుకుందని అతడు అనడం విశేషం. ఇందులో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మనూ అతడు ప్రశంసించాడు.
ప్రతీకారం అంటే ఇదీ: అక్తర్
సోమవారం (జూన్ 24) టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా టీమిండియా తాను ఆడిన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలుసు కదా. 24 పరుగులతో గెలిచిన ఇండియా ఓటమెరగని జట్టుగా సెమీఫైనల్ చేరింది. అక్కడ ఇంగ్లండ్ తో ఆడటానికి సిద్ధమవుతోంది. అయితే ఆసీస్ పై ఇండియా సాధించిన విజయాన్ని మాత్రం ఆకాశానికెత్తాడు షోయబ్ అక్తర్.
డిప్రెషన్ కాస్తా ఆబ్సెషన్ గా మారిందని అక్తర్ అనడం గమనార్హం. ఈ మేరకు అతడో వీడియో రిలీజ్ చేశాడు. "పెద్ద వేదికపై ఇండియా అసలుసిసలు ప్రతీకారం తీర్చుకుంది" అనే క్యాప్షన్ తో అక్తర్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. అందులో అతడు మాట్లాడుతూ.. "గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన తర్వాత ఇండియా డిప్రెషన్ లోకి వెళ్లింది.
కానీ ఇప్పుడది అబ్సెషన్ (వాళ్లను ఓడించాలన్న కసి)గా మారిపోయింది. ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించాలని ఇండియా భావించింది. రోహిత్ శర్మ తాను ఏం చేయాలో అదే చేశాడు. స్టార్క్ బౌలింగ్ లో అతడు ఆడిన తీరు అద్భుతం. అతడు 150 స్కోరు చేస్తాడని అనిపించింది" అని అక్తర్ అన్నాడు.
హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ. ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లలో పెద్దగా రాణించని అతడు.. ఇందులో మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 41 బంతుల్లోనే 92 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 8 సిక్స్ లు ఉన్నాయి. తనను పదే పదే ఇబ్బంది పెడుతున్న స్టార్క్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో నాలుగు సిక్స్ లు, ఒక ఫోర్ కొట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు.
చివరికి అతని బౌలింగ్ లోనే ఔటైనా.. అప్పటికే ఆస్ట్రేలియాకు చేయాల్సిన నష్టం చేసేశాడు. ఇక బౌలింగ్ లో కుల్దీప్, బుమ్రా కీలకమైన సమయంలో వికెట్లు తీసి ఇండియాను గెలిపించారు. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓటమికి కారణమైన ట్రావిస్ హెడ్.. ఈసారి కూడా అదే పని చేసేటట్లు కనిపించినా.. అసలు టైమ్ లో అతని వికెట్ తీసి ఇండియా ఊపిరి పీల్చుకుంది.
కుల్దీప్ 4 ఓవర్లలో కేవలం 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలకు గయానాలో జరుగుతుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ ఇండియా ఇదే ఇంగ్లండ్ చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే.