SA vs WI T20 world cup: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికా.. ఉత్కంఠ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసి..
SA vs WI T20 world cup: టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరింది సౌతాఫ్రికా. సూపర్ 8 డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ ను చివరి ఓవర్లో 3 వికెట్లతో చిత్తు చేసిందా టీమ్. ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది.
SA vs WI T20 world cup: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్ చేరింది సౌతాఫ్రికా టీమ్. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ చేరగా.. సోమవారం (జూన్ 24) ఉదయం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లతో గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్ లో చివరి ఓవర్ తొలి బంతికి ఫలితం తేలింది.
ఉత్కంఠ రేపిన సూపర్ 8 మ్యాచ్
సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికా, వెస్టిండీస్ హోరాహోరీగా తలపడ్డాయి. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ కు మధ్యలో వర్షం అడ్డుపడింది. దీంతో సౌతాఫ్రికాకు 17 ఓవర్లలో 123 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ టార్గెట్ ను సౌతాఫ్రికా 17వ ఓవర్ తొలి బంతికి 7 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే సౌతాఫ్రికా బ్యాటర్ మార్కో యాన్సెన్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు.
తీవ్ర ఒత్తిడిలోనూ యాన్సెన్ చివరి వరకు క్రీజులో ఉండి 14 బంతుల్లో 21 రన్స్ చేశాడు. అంతకుముందు 16వ ఓవర్ చివరి బంతికి రబాడా ఫోర్ కొట్టడం కూడా సౌతాఫ్రికాకు కలిసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్లకు 135 రన్స్ చేసినా.. వర్షం వల్ల సౌతాఫ్రికా లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు.
చేజింగ్‌లో తడబడి నిలబడుతూ..
టార్గెట్ చేజింగ్ లో సౌతాఫ్రికా తొలి ఓవర్లోనే 3 ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించింది. అయితే తర్వాతి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్ ప్రారంభం కాగానే వర్షం కురిసింది. చాలాసేపటి తర్వాత మ్యాచ్ ప్రారంభం కావడంతో మూడు ఓవర్లు తగ్గించి.. ఆ మేరకు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కొత్త టార్గెట్ సెట్ చేశారు.
తర్వాత కూడా స్టబ్స్, క్లాసెన్ సౌతాఫ్రికాను సులువుగా గెలిపించేలా కనిపించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 35 పరుగులు జోడించారు. అయితే 23 పరుగుల వ్యవధిరలో క్లాసెన్ (22), మిల్లర్ (4), స్టబ్స్ (29) వికెట్లు కోల్పోవడంతో సౌతాఫ్రికా 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివర్లో టార్గెట్ చేజింగ్ కష్టంగా సాగింది. అయితే యాన్సెన్ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి తీవ్ర ఒత్తిడిలోనూ సౌతాఫ్రికాను గెలిపించాడు.
ఈ విజయంతో గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా టాప్ లో నిలిచి సెమీస్ కు అర్హత సాధించింది. సూపర్ 8లో మూడింటికి మూడు మ్యాచ్ లు గెలిచింది. ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఇక గ్రూప్ 1 నుంచి సెమీఫైనల్స్ వెళ్లేది ఎవరు అన్నది తేలాల్సి ఉంది. ఇండియా వెళ్లడం ఖాయమే అయినా.. మరో టీమ్ ఏది అన్నది చూడాలి. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ ఈ స్థానం కోసం పోటీ పడుతున్నాయి.