T20 World Cup 2024: లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ - సౌతాఫ్రికాను గెలిపించిన బౌలర్లు - గెలుపు ముంగిట ఇంగ్లండ్ బోల్తా
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ముంగిట ఇంగ్లండ్ బోల్తా పడింది. బౌలర్ల మెరుపులతో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ చివరి బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ముంగిట ఇంగ్లండ్ బోల్తా కొట్టింది. ఓటమి ఖాయమైన తరుణంలో సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతం చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
ఏడు పరుగులు తేడాతో...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది. ఈ సింపుల్ టార్గెట్‌ను ఈజీగానే ఛేదించేలా కనబడిన ఇంగ్లండ్ చివరలో తడబడిండి. ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్ఠానికి 156 పరుగులు మాత్రమే చేసింది. ఏడు పరుగులతో ఓటమి పాలైంది.
మూడు ఓవర్లలో 25 రన్స్...
చివరి మూడు ఓవర్లలో ఇరవై ఐదు పరుగులు చేస్తే ఇంగ్లండ్‌దే గెలుపు. హిట్టర్లు బ్రూక్, లివింగ్‌స్టోన్ క్రీజులో ఉండటంతో ఇంగ్లండ్ ఈజీగానే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా సౌతాఫ్రికా బౌలర్లు విజృంభించారు. పరుగులు చేయకుండా ఇంగ్లండ్‌ను కట్టడి చేయడమే కాకుండా బ్రూక్, లివింగ్‌స్టోన్‌లను పెవిలియన్‌కు పంపించారు.
చివరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సి ఉండగా ఇంగ్లండ్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది. తొలి బంతికే బ్రూక్‌ను ఔట్ చేసి నోర్జ్ సౌతాఫ్రికా గెలుపు ఖాయం చేశాడు. సామ్ కరణ్ ఓ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. కానీ ఆ తర్వాతనోర్జ్ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంలో ఇంగ్లండ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది.
పోరాటం వృథా...
హ్యారీ బ్రూక్ 37 బాల్స్‌లో ఏడు ఫోర్లతో 53 రన్స్, పదిహేడు బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 33 రన్స్ పోరాటం వృథాగా మారింది. ఈ మ్యచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో దారుణంగా నిరాశపరిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా, కేశవ్ మహారాజా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
డికాక్ హాఫ్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా క్వింటన్ డికాక్ పోరాటంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. డికాక్ 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 65 రన్స్ చేశాడు
ఓ వైపు డికాక్ ఫోర్లు సిక్సర్లతో విరుచుకు పడగా మరో ఓపెనర్ హెండ్రిక్స్ మాత్రం 25 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికే సౌతాఫ్రికా స్కోరు 9.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులుగా ఉంది. దాంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈజీగా 200 స్కోరు చేస్తుందని భావించారు. అయితే 92 పరుగుల స్కోరు దగ్గర డికాక్ ఔటవడంతో సఫారీల పతనం మొదలైంది.
చివరలో మిల్లర్ మెరుపులు...
డికాక్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్ (8), మార్‌క్రమ్ (1) విఫలమయ్యారు. చివర్లో డేవిడ్ మిల్లర్ మాత్రమే చెలరేగాడు. అతడు 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 43 రన్స్ చేసి ఔటయ్యాడు. చివరి ఓవర్ తొలి బంతికి మిల్లర్ ఔటవడంతో సౌతాఫ్రికా 163 పరుగులతోనే సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, రషీద్ చెరొక వికెట్ తీసుకున్నారు.
వరుసగా రెండో గెలుపు...
సూపర్ 8 రౌండ్‌లో సౌతాఫ్రికాకు వరుసగా రెండో గెలుపు ఇది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై గెలుపుతో గ్రూప్ 2లో టాపర్‌గా సౌతాఫ్రికా నిలిచింది. సెమీ ఫైనల్ రేసులో నిలిచింది. ఓ గెలుపు, ఓ ఓటమితో గ్రూప్ 2లో ఇంగ్లండ్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది.