USA vs WI: షై హోప్ వీర‌విహారం - 10 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఖ‌తం - అమెరికాపై వెస్టిండీస్ రికార్డ్ విక్ట‌రీ-shai hope shines as west indies beat usa by 9 wickets in t20 world cup nicholas pooran ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Usa Vs Wi: షై హోప్ వీర‌విహారం - 10 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఖ‌తం - అమెరికాపై వెస్టిండీస్ రికార్డ్ విక్ట‌రీ

USA vs WI: షై హోప్ వీర‌విహారం - 10 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ఖ‌తం - అమెరికాపై వెస్టిండీస్ రికార్డ్ విక్ట‌రీ

Nelki Naresh Kumar HT Telugu
Jun 22, 2024 10:32 AM IST

USA vs WI: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అమెరికాపై వెస్టిండీస్ రికార్డ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. అమెరికా విధించిన 128 ప‌రుగుల టార్గెట్‌ను మ‌రో 55 బాల్స్ మిగిలుండ‌గానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెన‌ర్ షై హోప్ 39 బాల్స్‌లో 82 ప‌రుగులు చేశాడు.

అమెరికా వర్సెస్ వెస్టిండీస్
అమెరికా వర్సెస్ వెస్టిండీస్

USA vs WI: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లీగ్ ద‌శ‌లో సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్న అమెరికా సూప‌ర్ 8లో మాత్రం తేలిపోయింది. వ‌రుస‌గా రెండో ఓట‌మిని మూగ‌ట్టుకుంటుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి అమెరికా నిష్క్ర‌మించ‌డం క‌న్ఫామ్ అయ్యింది. సూప‌ర్ 8లో భాగంగా శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో అమెరికా చిత్తుగా ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో మ‌రో యాభై ఐదు బాల్స్ మిగిలుండ‌గానే వెస్టిండీస్ విజ‌యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 19.5 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఈ టార్గెట్‌ను వెస్టిండీస్ 10.5 ఓవ‌ర్ల‌లోనే కేవ‌లం ఓ వికెట్ మాత్ర‌మే న‌ష్ట‌పోయి ఛేదించింది.

39 బాల్స్‌లో 82 ర‌న్స్‌...

వెస్టిండీస్ ఓపెన‌ర్ షై హోప్ (Shai Hope) సిక్స‌ర్ల‌తో అమెరికా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఎనిమిది సిక్స‌ర్లు కొట్టాడు. 39 బాల్స్‌లోనే ఎనిమిది సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 82 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ 12 బాల్స్‌లో మూడు సిక్స‌ర్లు ఓ ఫోర్‌తో 27 ర‌న్స్ చేయ‌డంతో 10.5 ఓవ‌ర్ల‌లోనే వెస్టిండీస్ 130 ప‌రుగులు చేసింది.

షై హోప్, పూర‌న్ (Nicholas Pooran) జోరును అమెరికా బౌల‌ర్లు ఏ మాత్రం అడ్డుకోలేక‌పోయారు. వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్ కూడా ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. నేత్ర‌వాల్క‌ర్ వేసిన చివ‌రి ఓవ‌ర్‌లో షై హోప్ ఓ సిక్స్‌, పూర‌న్ రెండు సిక్స్‌లు కొట్టాడు. మిలింద్ కుమార్ వేసిన తొమ్మిది ఓవ‌ర్‌లో షై హోప్ హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. 16.43 ర‌న్ రేట్‌తో ఈ జోడీ కేవ‌లం 23 బాల్స్‌లోనే 63 ప‌రుగులు చేసింది.

రోస్ట‌న్ ఛేజ్ మూడు వికెట్లు...

బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ‌టంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన అమెరికా 19.5 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ 29 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. నితీష్ కుమార్ 20, మిలింద్ కుమార్ 19 ర‌న్స్ చేశారు. చివ‌ర‌లో అలీఖాన్ ఓ ఫోర్‌, సిక్స‌ర్ కొట్ట‌డంతో అమెరికా ఈ మాత్ర‌మైనా స్కోరు చేసింది.

వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో రోస్ట‌న్ ఛేజ్ నాలుగు ఓవ‌ర్లు వేసి 19 ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఛేజ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ర‌సెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్ల‌తో రాణించారు. ఈ మ్యాచ్‌లో ప‌ది ఓవ‌ర్ల‌లోనే టార్గెట్‌ను ఛేదించి ర‌న్‌రేట్‌ను వెస్టిండీస్ మెరుగు ప‌రుచుకుంది. సెమీస్ అవ‌కాశాల‌ను మెరుగు ప‌రుచుకుంది.

ఆస్ట్రేలియా త‌ర్వాత‌...

ఈ టీ20 మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేసింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎక్కువ బాల్స్ మిగిలుండ‌గానే వంద‌కుపైగా స్కోరు ఛేజ్ చేసిన రెండో జ‌ట్టుగా రికార్డ్ నెల‌కొల్పింది. 2007 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో శ్రీలంక‌పై 58 బాల్స్ మిగిలుండ‌గానే ఆస్ట్రేలియా గెలిచింది.

ప‌దిహేడు సిక్సులు...

ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నికోల‌స్ పూర‌న్ మొత్తంగా 17 సిక్సులు కొట్టాడు. ఒకే ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన క్రికెట‌ర్‌గా క్రిస్ గేల్ (ప‌ద‌హారు సిక్సులు) రికార్డును పూర‌న్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో శ్యామూల్స్ (15 సిక్సులు) మూడో స్థానంలో ఉన్నాడు.

నాలుగో క్రికెట‌ర్‌...

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఒకే ఇన్సింగ్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన నాలుగో క్రికెట‌ర్‌గా షై హోప్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో 11, 10 సిక్సుల‌తో క్రిస్ గేల్ ఫ‌స్ట్‌, సెకండ్ ప్లేస్‌ల‌లో కొన‌సాగుతోన్నాడు. అమెరికా క్రికెట‌ర్ అరోన్ జోన్స్ ప‌ది సిక్సుల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

Whats_app_banner