KKR vs PBKS: చివ‌రి బాల్‌కు ఫోర్ కొట్టి కోల్‌క‌తాను గెలిపించిన రింకు సింగ్ - ర‌సెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌-russell rinku singh power as kkr beat pbks by 5 wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Russell Rinku Singh Power As Kkr Beat Pbks By 5 Wickets

KKR vs PBKS: చివ‌రి బాల్‌కు ఫోర్ కొట్టి కోల్‌క‌తాను గెలిపించిన రింకు సింగ్ - ర‌సెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 09, 2023 06:26 AM IST

KKR vs PBKS: ర‌సెల్‌, రింకు సింగ్ మెరుపుల‌తో పంజాబ్ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ అద్భుత విజ‌యాన్ని అందుకున్న‌ది.

ర‌సెల్‌
ర‌సెల్‌

KKR vs PBKS: సోమ‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ చివ‌రి బాల్ వ‌ర‌కు న‌రాలు తెగే ఉత్కంఠ‌ను పంచింది. చివ‌రి బాల్‌కు ఫోర్ కొట్టిన రింకు సింగ్ కోల్‌క‌తాకు అదిరిపోయే విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై కోల్‌క‌తా గెలిచింది. 180 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేప‌ట్టిన కోల్‌క‌తా ఆరంభంలోనే ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ (15 ర‌న్స్‌) వికెట్ కోల్పోయింది.

ట్రెండింగ్ వార్తలు

మ‌రో ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌, కెప్టెన్ నితీష్ రానా క‌లిసి కోల్‌క‌తా ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించారు. జేస‌న్ 24 బాల్స్‌లో ఎనిమిది ఫోర్ల‌తో 38 ర‌న్స్ చేయ‌గా...నితీష్ రానా 38 బాల్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 51 ర‌న్స్ చేశాడు. చివ‌ర‌లో పంజాబ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో కోల్‌క‌తా స‌మీక‌ర‌ణం 24 బాల్స్‌లో 51 ప‌రుగులుగా మారింది.

ఈ త‌రుణంలో ర‌సెల్‌, రింకుసింగ్ ఎదురుదాడికి దిగారు. ప‌దిహేడో ఓవ‌ర్‌లో 15 ర‌న్స్‌, ప‌ద్దెనిమిదో ఓవ‌ర్‌లో 10 ర‌న్స్ చేశారు. సామ్ క‌ర‌న్ వేసిన 19వ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు కొట్టి కోల్‌క‌తా విజ‌యాన్ని తేలిక చేశాడు ర‌సెల్‌. ఆ ఓవ‌ర్‌లో మూడు సిక్స‌ర్లు, రెండు సింగిల్స్‌తో ఇర‌వై ర‌న్స్ వ‌చ్చాయి. చివ‌రి ఓవ‌ర్‌లో ఆరు ప‌రుగులు అవ‌స‌రం కాగా అర్ష‌దీప్ సింగ్ లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయ‌డంతో నాలుగు బంతుల్లో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఐదు బంతికి ర‌సెల్ ర‌నౌట్ కావ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌గా మారింది. చివ‌రి బాల్‌కు రెండు ప‌రుగులు అవ‌స‌ర‌మైన త‌రుణంలో రింకు సింగ్ ఫోర్ కొట్టి కోల్‌క‌తాను గెలిపించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో రాహుల్ చాహ‌ర్ 2 వికెట్లు తీసుకున్నాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 179 ర‌న్స్ చేసింది. కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. 47 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 57 ర‌న్స్ చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావ‌డం పంజాబ్ 179ప‌రుగులే చేసింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 3, హ‌ర్షిత్ రానా రెండు వికెట్లు తీసుకున్నారు.

WhatsApp channel