India vs Australia Weather: టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?-india vs australia st lucia weather not looking good what if rain washes out the match ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia Weather: టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?

India vs Australia Weather: టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?

Hari Prasad S HT Telugu
Jun 24, 2024 09:08 AM IST

India vs Australia Weather: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8లో భాగంగా సోమవారం (జూన్ 24) ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు డూ ఆర్ డైగా మారనుంది. కానీ వాతావరణం కూడా వాళ్లను భయపెడుతోంది.

టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?
టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి? (ANI)

India vs Australia Weather: ఆఫ్ఘనిస్థాన్ తో చేతుల్లో అనూహ్యంగా ఓడిన మాజీ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడనుంది. సెమీస్ చేరాలంటే ఇందులో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఆ టీమ్ బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్ జరగాల్సిన సెయింట్ లూసియాలో వాతావరణం పెద్దగా అనుకూలంగా కనిపించడం లేదు. మరి మ్యాచ్ రద్దయితే ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి?

ఇండియా, ఆస్ట్రేలియా.. మధ్యలో వర్షం

టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్ లో ఇండియా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సెమీస్ కు చేరువైంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచినా, వర్షం వల్ల రద్దయినా సెమీస్ చేరుతుంది. కానీ ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో ఓడిన ఆస్ట్రేలియా పరిస్థితే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఇండియాపై గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్ చేరుతుంది.

లేదంటే కష్టమే. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డు పడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఎలా? ఇండియా చేతుల్లోనూ ఆస్ట్రేలియా ఓడితే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయా? గ్రూప్ 1లో ఏ టీమ్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.

వాతావరణం ఎలా ఉందంటే?

సెయింట్ లూసియా వాతావరణం ప్రస్తుతానికి ఈ కీలక మ్యాచ్ కు అస్సలు అనుకూలంగా లేనట్లు అక్యువెదర్ రిపోర్ట్ చెబుతోంది. సోమవారం (జూన్ 24) రోజంతా ఆకాశం మేఘవృతమై అప్పుడప్పుడూ వర్షం పడుతుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. రోజు మొత్తం వర్షం పడే అవకాశం 65 శాతంగా ఉండటం గమనార్హం.

స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి వర్షం లేకపోయినా మేఘావృతమై ఉండనుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో సమయానికి ప్రారంభం కావడం కూడా అనుమానమే అని చెప్పాలి. ఒకవేళ ఆలస్యంగా ప్రారంభమైనా మధ్యాహ్నం మరోసారి భారీ వర్షం ఛాన్స్ ఉండటంతో మ్యాచ్ అసలు జరిగే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు.

మ్యాచ్ రద్దయితే ఎలా?

సూపర్ 8 మ్యాచ్ రద్దయితే ఇండియా, ఆస్ట్రేలియాకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. ఈ స్టేజ్ లో ఐసీసీ రిజర్వ్ డే మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో ఈరోజు మ్యాచ్ అవకాశం ఉంటే సరే.. లేదంటే రద్దు చేసి చెరొక పాయింట్ ఇస్తారు. అప్పుడు ఇండియా సెమీఫైనల్ వెళ్తుంది. అటు ఆస్ట్రేలియా ఖాతాలో 3 పాయింట్ల ఉంటాయి. అప్పుడు బంగ్లాదేశ్ చేతుల్లో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోతేనే ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుంది.

ఆ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే ఆ టీమే ముందడుగు వేస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్ రద్దయితే మాత్రం ఆఫ్ఘనిస్థాన్ కూడా మూడు పాయింట్లతో ఉంటుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ తో ఆస్ట్రేలియా సెమీస్ వెళ్తుంది.

Whats_app_banner