AUS vs AFG: ఆస్ట్రేలియాపై అఫ్గానిస్తాన్ సంచలన విజయం - పాట్ కమిన్స్ సెకండ్ హ్యాట్రిక్ వృథా
AUS vs AFG: టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ గెలుపుతో పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వృథాగా మారింది.
AUS vs AFG: టీ20 వరల్డ్ కప్‌లోbఅఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. టైటిల్ ఫేవరేట్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం సూపర్ 8లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ విజయంతో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వృథాగా మారింది.
వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్...
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను గెలిపించేందుకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ పోరాడాడు. మ్యాక్స్‌వెల్ పోరాటంతో వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు అనుకున్నారు. వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ పై ఓటమి దిశగా సాగుతోన్న ఆస్ట్రేలియాను డబుల్ సెంచరీతో గెలిపించాడు మ్యాక్స్‌వెల్. కానీ టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం మ్యాక్స్‌వెల్ జోరుకు అఫ్గానిస్తాన్ బౌలర్లు బ్రేకులు వేశారు.
హాఫ్ సెంచరీలు...
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేయగా..ఆస్ట్రేలియా 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అఫ్గానిస్తాన్ ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. గుర్భాజ్ 49 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 60 రన్స్ చేయగా... జర్ధాన్ 48 బాల్స్‌లో ఆరు ఫోర్లతో 51 రన్స్ చేశాడు.
చెత్త రికార్డ్...
అయితే వీరిద్దరు నెమ్మదిగా ఆడటంతో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. టీ20 క్రికెట్‌లో లోయెస్ట్ రన్‌రేట్‌లో వంద పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన రెండో ఓపెనింగ్ జోడీగా జర్ధాన్, గుర్భాజ్ నిలిచారు. మొదటి స్థానంలో గుర్భాజ్, జర్ధాన్‌లే ఉన్నారు.
ఓపెనర్లు ఔట్ కావడంతో అఫ్గానిస్తాన్ పతనం మొదలైంది. మిగిలిన వికెట్లను చకచకా కోల్పోయింది. చివరలో నబీ రెండు ఫోర్లు కొట్టడంతో ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మూడు, జంపా రెండు వికెట్లు తీసుకున్నారు
తొలి ఓవర్‌లోనే డకౌట్...
సింపుల్ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేసి షాకిచ్చాడు నవీన్ ఉల్ హక్. డేవిడ్ వార్నర్ మూడు పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఆస్ట్రేలియాను గెలిపించేందుకు మ్యాక్స్‌వెల్ పోరాడాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో అతడి బ్యాటింగ్ మెరుపులు సరిపోలేదు. మ్యాక్స్‌వెల్ 41 బాల్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 59 రన్స్ చేశాడు. అతడిని గుల్భదిన్ నైబ్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది
పెవిలియన్‌కు క్యూ...
అఫ్గానిస్తాన్ బౌలర్ గుల్భదిన్ నైబ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్భదిన్ నైబ్ నాలుగు, నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీసుకున్నారు.
కమిన్స్ హ్యాట్రిక్...
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. వరుసగా రెండు మ్యాచుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ నమోదు చేసిన కమిన్స్ తాజాగా ఆదివారం అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఆప్ఘాన్ బ్యాటర్లు రషీద్ ఖాన్, కరీమ్ జన్నత్‌తో పాటు గుల్బదీన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు పాట్ కమిన్స్.
తొలి బౌలర్‌గా రికార్డ్...
పద్దెనిమిదో ఓవర్ చివరి బాల్‌కు రషీద్‌ఖాన్‌ను ఔట్ చేసిన కమిన్స్...ఆ తర్వాత లాస్ట్ ఓవర్‌లో తొలి బాల్‌కు కరీమ్ జన్నత్‌ను, రెండో బాల్‌కు నైబ్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ వికెట్లను దక్కించుకున్నాడు.
వరల్డ్ కప్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఫస్ట్ క్రికెటర్‌గా కమిన్స్ నిలిచాడు. అంతే కాకుండా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఫస్ట్ క్రికెటర్ కూడా కమిన్స్ కావడం గమనార్హం.
టీ20 క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఐదో క్రికెటర్‌గా కమిన్స్ నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ, టీమ్ సౌథీతో పాటు మార్క్ పావ్లోవిక్, వసీమ్ అబ్బాస్ ఉన్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఆప్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆప్ఘాన్ గెలుపుతో పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వృథాగా మారింది.
టాపిక్