Sehwag on India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్‌లను ఐసీసీ ఇక ఎప్పుడూ ఒకే గ్రూపులో ఉంచదు: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
Sehwag on India vs Pakistan: టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇండియా, పాకిస్థాన్ లను ఐసీసీ ఎప్పుడూ ఒకే గ్రూపులో ఉంచబోదని అతడు అనడం గమనార్హం.
Sehwag on India vs Pakistan: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ నుంచే పాకిస్థాన్ ఇంటికెళ్లిపోవడంతో టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న జట్టు చేతిలో ఓడిన పాకిస్థాన్ కు వర్షాన్ని నిందించే హక్కు లేదని అతడు అన్నాడు. అంతేకాదు ఇక నుంచి ఐసీసీ ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచబోదని కూడా అన్నాడు.
వర్షాన్ని ఎలా నిందిస్తారు?
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఎలో ఇండియా, యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్ లతోపాటు పాకిస్థాన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే యూఎస్ఏ, ఇండియా చేతుల్లో ఓడిపోవడంతోపాటు యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఔటైపోయింది. దీనిపై సెహ్వాగ్ చాలా ఘాటుగా స్పందించాడు.
క్రిక్‌బజ్ తో మాట్లాడిన వీరూ.. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న జట్టులో ఓడిన మీరు.. వర్షాన్ని ఎలా నిందిస్తారంటూ ప్రశ్నించాడు. "వర్షాన్ని ఎలా నిందిస్తారు? ఒకవేళ మీరు గెలిచినా తర్వాతి రౌండ్ కు వెళ్లే అర్హత మీకు లేదు. సూపర్ 8 స్టేజ్ లో ఓడిపోయేవారు. అక్కడ మీకు సులువైన ప్రత్యర్థులు ఉండరు. తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న వాళ్ల చేతుల్లో ఓడిపోయారన్నది తెలుసుకోవాలి. మీకు ముందుకు వెళ్లే అర్హతే లేదు. ఇండియాతో 120 చేజ్ చేయలేకపోయారు. వికెట్లు చేతిలో ఉన్నా 113 రన్స్ చేశారు. మీరు వర్షాన్ని ఎలా నిందిస్తారు" అని వీరూ చాలా ఘాటుగా స్పందించాడు.
ఐసీసీకి సెహ్వాగ్ సందేశం
ఐసీసీ ఏ మెగా టోర్నీ నిర్వహించినా.. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ పైనే భారీ ఆశలు పెట్టుకుంటుంది. ఈ రెండు టీమ్స్ కనీసం ఒక్కసారి కంటే ఎక్కువ మ్యాచ్ లలో ఆడాలని భావిస్తుంది. దీంతో చాలా రోజులుగా ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచుతూ వస్తోంది. దీనివల్ల ఈ దాయాదులు ఒక్కసారి కచ్చితంగా తలపడతాయి.
కానీ దీనివల్ల పాకిస్థాన్ ముందడుగు వేసే పరిస్థితి లేకుండా పోవడంతో ఐసీసీకి సెహ్వాగ్ ఓ సందేశాన్నిచ్చాడు. "2007 వన్డే వరల్డ్ కప్ లో ఇండియాగానీ, పాకిస్థాన్ గానీ రెండో రౌండ్ కు అర్హత సాధించలేకపోయాయి. అప్పట్లో మేము రెండు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాం. ఇప్పుడు ఐసీసీ మరోసారి ఇండియా, పాకిస్థాన్ లను ఒకే గ్రూపులో ఉంచడాన్ని పునరాలోచించాలి. అంతేకాదు ఆ జట్లను ఓడించే జట్లు కూడా ఆ గ్రూపుల్లో లేకుండా చూసుకోవాలి" అని సెహ్వాగ్ అనడం విశేషం.
అసలే చాలా చప్పగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి తొలి రౌండ్లోనే పాకిస్థాన్ తోపాటు న్యూజిలాండ్, శ్రీలంకలాంటి టాప్ టీమ్స్ కూడా ఔటైపోయాయి. దీంతో సూపర్ 8 స్టేజ్ మరింత చప్పగా సాగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు ఇక ఈ టోర్నీలో మరోసారి ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడం కూడా ఈ మెగా టోర్నీపై అభిమానుల్లో ఆసక్తి లేకుండా చేస్తుందన్నది సెహ్వాగ్ ఉద్దేశంగా కనిపిస్తోంది.