Suresh Raina : లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?-suresh raina to be part of lanka premier league 2023 player auction ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suresh Raina : లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?

Suresh Raina : లంక ప్రీమియర్ లీగ్ వేలంలో సురేష్ రైనా.. ధర ఎంతో తెలుసా?

Anand Sai HT Telugu
Jun 13, 2023 05:47 AM IST

Suresh Raina : భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా విదేశీ లిగ్స్ మీద దృష్టిపెట్టాడు. లంక ప్రీమియల్ లీగ్ లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నాడు.

సురేష్ రైనా
సురేష్ రైనా

భారత మాజీ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం సురేష్ రైనా(Suresh Raina) 2023 ఎడిషన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. రాబోయే ఎడిషన్ కోసం వేలం ప్రక్రియ జరగనుంది. సురేష్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు. కాబట్టి అనుభవజ్ఞుడైన ఈ ఆటగాడిని ఏ జట్టు తీసుకుంటుందో చూడాలి.

లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ కోసం బిడ్డింగ్ ప్రక్రియ బుధవారం, జూన్ 14న జరుగుతుంది. భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా బేస్ ధర 50,000 డాలర్లు. టోర్నీ జూలై 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 20న ముగుస్తుంది.

సెప్టెంబర్ 2022లో అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, సురేష్ రైనా విదేశీ లీగ్‌లపై దృష్టి పెట్టాడు. 2022 డిసెంబర్‌లో ప్రారంభమైన అబుదాబి టీ10 లీగ్‌లో ఆడిన రైనా డెక్కన్ గ్లాడియేటర్ తరఫున ఆడుతున్నాడు. గత మార్చిలో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో రైనా కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు సురేష్ రైనా ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు.

లంక ప్రీమియర్ లీగ్ ఈసారి టోర్నీ నాలుగో ఎడిషన్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ మోడల్‌లో వేలం ప్రక్రియ నిర్వహించడం ఇదే తొలిసారి. 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే మొత్తం ఐదు జట్లు కూడా తమ జట్టును నిర్మించడానికి 500,000 US డాలర్లను కలిగి ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ఈ టోర్నీలో పాల్గొన్న ప్రధాన అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు.

ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు లిఖించి, మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేష్ రైనా కోసం ఎల్‌పీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. అందుకే ఈ భారత ఆటగాడు వేలానికి ఎంత మొత్తానికి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు మిడిలార్డర్‌లో కీలక ఆయుధంగా నిలిచిన సురేష్ రైనా 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే సురేష్ రైనా కంటే ఎక్కువ పరుగులు చేశారు.

Whats_app_banner

టాపిక్