Ayodhya Ram Temple : రామ మందిర పైకప్పుకు చిల్లు- భారీ వర్షాలకు గర్భగుడిలోకి చేరిన నీరు!
25 June 2024, 9:40 IST
- Ayodhya Ram Temple roof leaking : అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగా నిర్మించిన అయోధ్య రామ మందిర గర్భుగుడి పైకప్పుకు చిల్లు పడింది! గర్భగుడిలోకి నీరు చేరింది.
అయోధ్య రామ మందిరం..
Ayodhya Ram Temple roof leaking : సరిగ్గా ఆరు నెలల క్రితం.. అత్యంత ఘనంగా, అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది అయోధ్య రామ మందిర. కాగా.. ఆరు నెలలకే మందిర పైకప్పుకు చిల్లు పడింది! అంతేకాదు.. ప్రస్తుతం అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఆలయ గర్భగుడిలోకి సైతం నీరు చేరుకుంది. వర్షపు నీరు పోయేందుకు ఆలయ పరిసరాల్లో అసలు సరైన డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదని ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ చెప్పారు.
"ఆలయం ప్రారంభమైన తర్వాత ఇదే మొదటి వర్షం. రామ్ లల్లా విగ్రహం పెట్టిన గర్భగుడి పైకప్పుకు అప్పుడే చిల్లు పడింది. ఇలాంటి విషయాలను పట్టించుకోవాలి. ఏం తప్పు జరిగిందో తెలుసుకోవాలి. ఇది చాలా అవసరం. అంతేకాదు.. నీరు బయటకు పోయేందుకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు. వర్షం మరింత పెరిగితే.. పూజలు, ప్రార్థనలు చేయడానికి కష్టమవుతుంది," అని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
ఇంత మంది ఇంజినీర్లు కలిసి ఆలయాన్ని నిర్మించినా.. ఇలా లీకులు ఎందుకు జరుగుతున్నాయో ఆశ్చర్యంగా ఉందన్నారు అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకులు.
"ప్రాణ ప్రతిష్ఠ సమయంలో చాలా మంది ఇంజినీర్లు ఇక్కడ ఉన్నారు. కానీ అప్పుడ పైకప్పు లీక్ అవుతోంది. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు," అని అన్నారు సత్యేంద్ర దాస్.
గర్భగుడి పైకప్పు లీక్ అవుతోందన్న విషయాన్ని శ్రీ రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ న్రిపింద్ర మిశ్రా అంగీకరించారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించినట్టు చెప్పారు.
"నేను అయోధ్యలో ఉన్నాను. మొదటి అంతస్తు నుంచి నీరు పడటాన్ని చూశాను. గురు మండపం కవర్ చేయలేదు. అక్కడి నుంచి ఆకాశం కనిపిస్తుంది. రెండో అంతస్తులో పనులు పూర్తయితే.. ఈ ఓపెనింగ్ కవర్ అవుతుంది. మొదటి అంతస్తులో కూడా పనులు జరుగుతున్నాయి. గర్భగుడిలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎందుకుంటే.. అన్ని మండపాల్లో నీరు సులభంగా పోయేందుకు స్లోప్‌లో కట్టాము. గర్భగుడిలో నీరు దానంతట అదే పోతుంది," అని చెప్పుకొచ్చారు మిశ్రా.
Ayodhya Ram Mandir : "విగ్రహానికి భక్తులు అభిషేకం చేయడం లేదు. డిజైన్ పరంగా, నిర్మాణం పరంగా సమస్య లేదు. ఓపెన్ చేసి ఉంచిన మండపాల్లోకి నీరు చేరుతుందన్న విషయంపై ముందే చర్చించాము. కానీ నగర్ ఆర్కిటెక్చర్ సంప్రదాయం ప్రకారం.. వాటిని అలాగే వదిలేశాము," అని స్పష్టం చేశారు మిశ్రా.
జనవరి 22న అయోధ్య రామ మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
అయోధ్యలో భారీ వర్షాలు..
Ayodhya rains : అయోధ్యలో శనివారం నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నయి. ఫలితంగా.. అనేక చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. కొత్తగా నిర్మించిన రామ్‌పథ్ రోడ్డు కుంగిపోయింది! ఆదివారం ఉదయం నుంచి.. రామ్పథ్కు దారి తీసే 13 రోడ్లు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లల్లోకి డ్రైనేజ్ నీరు చేరుకుంది.
"డ్రైనేజ్ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాము. అనేక బృందాలను ఇంటింటికీ పంపిస్తున్నాము," అని అయోధ్య మేయర్ గిరీశ్ పాటి త్రిపాఠి తెలిపారు.
ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. అయోధ్య ఉన్న ఫరీదాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిన విషయం తెలిసిందే!