Madhura meenakshi temple: మధుర మీనాక్షి ఎలా అవతరించారు? ఈ ఆలయం విశిష్టత ఏంటి?
Madhura meenakshi temple: మధుర మీనాక్షి ఆలయ విశిష్టత ఏంటి? ఈ ఆలయం వైభవం గురించి పురాణాలలో ఏముందనే విషయాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
Madhura meenakshi temple: తమిళనాడు రాష్ట్రం ఆలయాలకు, సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. అలాంటి తమిళనాడులో మదురైనందు వెలసిన పుణ్యక్షేత్రం మధుర మీనాక్షి అమ్మవారి కోవెల అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మీనాక్షి ఆలయ చరిత్ర
ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే.. మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలిగా జన్మించారు. మూడు రొమ్ములతో పాప జన్మించడంతో పాండ్య రాజు ఆందోళనకు గురి అవుతాడు. జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ బాలిక శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేస్తాడు. ఆ చిన్నారికి అన్నిరకాల విద్యలు నేర్పిస్తాడు. యుద్ధ విద్యలో పరిణతి చెందిన ఆమె ఓసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది.
అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుడిని చూసి ముగ్ధురాలవుతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె శరీరంలో మార్పులు వస్తాయి. యోగనిద్ర నుంచి మేలుకున్న శివుడు తన కొరకే జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమే మీనాక్షి. ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువుదీరాడని చిలకమర్తి తెలిపారు.
మధువు అంటే అమృతం. త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి మధురై అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతుందని చిలకమర్తి తెలిపారు. మధుర మీనాక్షీ ఆలయం ఎత్తయిన రాజగోపురాలు కలిగిన ఆలయంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిందని చిలకమర్తి తెలిపారు.
వైగై నదీ తీరంలోని మధురై క్షేత్రమే నటరాజ శివుని నాట్యపీఠం అని పురాణాలు వర్ణిస్తున్నాయని చిలకమర్తి తెలిపారు. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ముందుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత అమ్మ వారిని దర్శించుకోవడం సాంప్రదాయం. అయితే మధురైలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరస్వామిని దర్శించుకోవాలన్నది ఆచారం. ఈ ఆలయంలో ఉన్న కొనేరుకు 'స్వర్ణకమల తటాకం' అని పేరు.
పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలాలతో శివుడిని ఇక్కడే పూజించి తన పాపాన్నీ పోగొట్టుకున్నట్లు ప్రతీతి. అందుకే దీనికి స్వర్ణ కమల తటాకం అనే పేరు వచ్చిందని చిలకమర్తి తెలిపారు. భారతీయ సంస్కృతికి, సుందరమైన శిల్పకళకు నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నంతనే ఎన్నో శుభాలు జరుగుతాయని ఎంతోమంది విశ్వసిస్తున్నారని ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్