తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నిర్వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత

Ayodhya: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నిర్వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత

HT Telugu Desk HT Telugu

22 June 2024, 14:41 IST

google News
  • Ayodhya: ఈ జనవరి నెలలో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం కన్నుమూశారు. 86 ఏళ్ల దీక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం
అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం

Ayodhya: అయోధ్య (ayodhya)లో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి సుందర విగ్రహానికి ఘనంగా, శాస్త్రోక్తంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన ప్రధాన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ శనివారం ఉదయం ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కన్నుమూశారు. 86 ఏళ్ల దీక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట

ఈ సంవత్సరం జనవరి 22న ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారణాసికి చెందిన సీనియర్ పండితుల్లో ఒకరైన దీక్షిత్ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవారు. అయితే, ఆయన కుటుంబం తరతరాలుగా వారణాసిలో నివసిస్తోంది.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి

ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ మృతిపట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీకి చెందిన గొప్ప పండితుడు, శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన అర్చకుడు ఆచార్య శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ నిష్క్రమణ ఆధ్యాత్మిక, సాహిత్య ప్రపంచానికి తీరని లోటని సీఎం యోగి ఆదిత్య నాథ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మరణించిన శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆత్మకు తన పాదాల వద్ద స్థానం కల్పించాలని, ఈ బాధను భరించే శక్తిని తన కుటుంబ సభ్యులకు, శిష్యులకు, అనుచరులకు ఇవ్వాలని ఆ శ్రీరామ చంద్రుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

తదుపరి వ్యాసం