ఇటీవల విడుదలైన జైలర్ చిత్రం(Jailer Movie) ఘన విజయం సాధించింది. కొద్ది రోజుల్లోనే 300 కోట్ల కలెక్షన్స్‌ని క్రాస్ చేసింది. ఈ చిత్రం 500 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. తన సినిమా ఘనవిజయం సాధించిన తరుణంలో రజనీకాంత్(Rajinikanth) ఆధ్యాత్మిక యాత్రకు ఉత్తర భారతదేశానికి వెళ్లారు. హృషీకేశ్, బద్రీనాథ్, బాబా గుహ, ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించిన రజనీకాంత్ ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌ను కలిశారు. తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath)ను కలిసిన నటుడు రజనీకాంత్.. ఆయన కాళ్లకు నమస్కరించారు. యోగి ఆదిత్యనాథ్ కంటే సీనియర్ అయిన రజనీకాంత్(Rajinikanth).. కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటో, వీడియో వైరల్‌గా మారాయి. రజనీకాంత్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ‘జైలర్’ సినిమా చూసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సూపర్ స్టార్ అయోధ్యలో పర్యటించి రామమందిర నిర్మాణ పనులను వీక్షించనున్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మధ్య కాలంలో సినిమాలకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. గతంలో విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమాలకు పన్ను మినహాయింపు ప్రకటించారు. తన రాష్ట్రంలో భారీ సినిమా సిటీని నిర్మించాలని కూడా ఆయన ప్రతిపాదించారని, ఈ విషయమై బాలీవుడ్ సీనియర్ నటీనటులు, నిర్మాతలను పిలిపించి సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇప్పుడు నటుడు రజనీకాంత్‌ను కలిశారు.
యూపీ పర్యటనకు ముందు, రజనీకాంత్ జార్ఖండ్‌కు వెళ్లారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ చిన్నమస్తా ఆలయాన్ని సందర్శించి, మెుక్కులు సమర్పించారు. అక్కడ ఒక గంట గడిపారు. రాంచీలోని 'యాగోదా ఆశ్రమం'లో ధ్యానం చేశారు. దీని తర్వాత రాజ్ భవన్‌లో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు.
రజనీకాంత్ నటించిన జైలర్(Rajinikanth Jailer) ఆగస్టు 10న విడుదలైంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ తో పాటు శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. తెలుగు నటులు సునీల్, నాగబాబు కూడా కనిపించారు. తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు భారీ వసూళ్లను రాబడుతోంది. నెల్సన్ దీలిప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది.