Atiq Ahmad's killers : పెద్ద గ్యాంగ్స్టర్స్ అవ్వాలనే అతీక్‌ను చంపేసిన కిల్లర్స్!
16 April 2023, 12:11 IST
Atiq Ahmad shot dead : అతీక్ అహ్మద్‌ను చంపిన 'కిల్లర్స్' వివరాలు బయటకొచ్చాయి. పెద్ద గ్యాంగ్స్టర్స్ అవ్వాలన్న ఉద్దేశంతో అతీక్‌ను చంపినట్టు.. వీరు పోలీసులకు చెప్పారని సమాచారం.
అతీక్ అహ్మద్ కిల్లర్స్‌లో ఒకరిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు..
Atiq Ahmad killers : గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా.. అతీక్ అహ్మద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన ముగ్గురు వివరాలు బయటకు వచ్చాయి. ఈ ముగ్గురిపై గతంలో అనేక కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.
ముగ్గురు నిందితుల వివరాలు..
లవ్లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యాలు శనివారం రాత్రి అతీక్ అహ్మద్‌ను చంపేశారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌ను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. జర్నలిస్టుల ముసుగులో వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. అనంతరం పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Lovlesh Tewari Atiq Ahmed : నిందితుల్లో ఒకడైన లవ్లేష్ తివారీ ఇప్పటికే ఒకసారి జైలు జీవితాన్ని గడిపినట్టు తెలుస్తోంది. అయితే.. అతడితో తమకు ఎప్పుడో సంబంధం తెగిపోయిందని లవ్లేష్ తండ్రి మీడియాకు వివరించారు.
"అతను నా కుమారుడు. జరిగిన ఘటనను టీవీలో చూశామ. లవ్లేష్ చర్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు అతనితోనే మాకు సంబంధం లేదు. అతను ఇక్కడ నివాసముండడు. మా కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. 4-5 రోజుల ముందు వచ్చాడు. ఏం చెప్పలేదు. వెళ్లిపోయాడు. అతనితో మేము సరిగ్గా మాట్లాడి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. అతనిపై కేసు కూడా ఉంది. జైలుకు కూడా వెళ్లాడు. లవ్లేష్ పని చేయడు. డ్రగ్స్‌కు బానిసైయ్యాడు," అని నిందితుడి తండ్రి, బండా ప్రాంతంలో నివాసముంటున్న యగ్య తివారీ తెలిపారు.
Sunny Singh Atiq Ahmad : మరో నిందితుడు సన్నీపై ఏకంగా 14 కేసులు ఉన్నాయి! ఇంతకాలం అతను పరారీలో ఉన్నాడు. అతని తండ్రి మరణం అనంతరం, పూర్వికుల ఆస్తులను అమ్మేసి, తన గ్రామం నుంచి వెళ్లిపోయాడు. తల్లి, సొదరుడిని.. గత ఐదేళ్లల్లో సన్నీ ఎప్పుడూ కలవలేదు! అతని సోదరుడు ఓ టీ స్టాల్ నడుపుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు.
"తిరగడమే అతని పని. వేరే పని చేసేవాడు కాదు. మేము వేరువేరుగా జీవించే వాళ్లం. క్రిమినల్ ఎలా అయ్యాడో మాకు తెలియదు. ఈ ఘటన గురించి మాకు ఏం తెలియదు," అని సన్నీ సింగ్ సోదరుడు పింటూ సింగ్ తెలిపాడు.
Arun Maurya Atiq Ahmed : మూడో నిందితుడు అరుణ్.. చిన్నప్పుడే ఇంటిని విడిచి పారిపోయాడు. 2010లో ట్రైన్లో దారుణ హత్యకు గురైన ఓ పోలీసు అధికారికి సంబంధించిన కేసులో ఇతని పేరు ఉందని తెలుస్తోంది. ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.
'పెద్ద గ్యాంగ్స్టర్స్ అవ్వాలనే చంపేశాము..'
అతీక్ అహ్మద్ షూటర్స్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తుతో పాటు విచారణను కూడా చేపట్టారు. నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే.. పెద్ద గ్యాంగ్స్టర్స్ అవ్వాలన్న లక్ష్యంతోనే అతీక్‌ను చంపేసినట్టు నిందితులు పోలీసులు చెప్పారని సమాచారం.
Atiq Ahmed death latest updates : "అతీక్‌ను చంపితే మాకు పెద్ద పేరు వస్తుంది. భవిష్యత్తులో మేము గ్యాంగ్స్టర్స్ వ్వొచ్చు. మాకు చాలా లాభాలుంటాయి. సరైన సమయం చూసుకుని అతీక్‌ను చంపాలని ఎదురుచూశాము. అందుకే ఇంతకాలం ఎదురుచూశాము," అని నిందితులు పోలీసులకు చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే నిందితుల మాటలను పోలీసులు నమ్మడం లేదని, వారి అబద్ధం చెబుతున్నారని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారి మాటల్లో కొన్ని అనుమానాలకు తావిస్తుండటం ఇందుకు కారణం అని సమాచారం. నిందితులపై దర్యాప్తు కొనసాగించి, అసలు నిజయం బయటపెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.