Atiq Ahmad : 'గ్యాంగ్‌స్టర్' అతీక్ అహ్మద్.. రాజకీయ నేత నుంచి మరణం వరకు..
Atiq Ahmad criminal record : అతీక్ అహ్మద్ దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో అతడి గతం, జీవితం, నేర చరిత్ర, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన వివరాలను ఓసారి చూద్దాము..
Atiq Ahmad shot dead : 5సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, ఓసారి ఎంపీగా పార్లమెంట్ మెట్లు ఎక్కిన "గ్యాంగ్‌స్టర్" అతీక్ అహ్మద్.. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. సోదరుడు అష్రాఫ్‌తో పాటు అతడిని వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళుతుండగా.. కొందరు దుండగులు జర్నలిస్టుల వేషంలో వచ్చి వారిద్దరిని కాల్చి చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో అతీక్ అహ్మద్ జీవితం, నేర చరిత్ర, రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కథలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
అతీక్ అహ్మద్ వ్యక్తిగత జీవితం..
ఉత్తర్ ప్రదేశ్‌లోని శ్రవస్తిలో 1962లో జన్మించాడు అతీక్ అహ్మద్. అతనికి సైస్తా ప్రవీణ్ అనే మహిళతో వివాహమైంది(ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది). వీరికి ఐదుగురు కుమారులు ఉన్నారు. వారి పేర్లు అలీ, ఉమర్, అహ్మద్, అసద్, అహ్జాన్, అబాన్. అసద్ అహ్మద్.. పోలీసుల ఎన్కౌంటర్లో శుక్రవారం మరణించాడు.
ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రాఫ్.. అతీక్ అహ్మద్ సోదరుడు. అతను గతంలో యూపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించాడు.
అతీక్ అహ్మద్ రాజకీయ ప్రయాణం..
Atiq Ahmed death viral video : ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై అతీక్ అహ్మద్‌కు మంచి పట్టు ఉంది! 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అంతేకాకుండా.. ఎంపీగానూ విధులు నిర్వర్తించాడు.
1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. నాటి అల్లహాబాద్ వెస్ట్ (ప్రయాగ్‌రాజ్) ఎమ్మెల్యే సీటును దక్కించుకున్నాడు అహ్మద్. అక్కడి నుంచి మరో మూడు సార్లు అదే సీటు నుంచి గెలుస్తూ వచ్చాడు. 1996లో నాలుగోసారి గెలిచినప్పుడు.. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు.
మూడేళ్ల తర్వాత ఎస్పీకి గుడ్ బై చెప్పిన అతీక్ అహ్మద్.. అప్నా దళ్ (కమేరవాడి) అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. అయితే.. ఆ తర్వాతి ఏడాదే తిరిగి ఎస్పీలో చేరిపోయాడు. 14వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి.. ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు కూడా వెళ్లాడు. 2004 నుంచి 2009 వరకు ఎంపీగా విధులు నిర్వర్తించాడు. ఈ ఫుల్పూల్ నియోజకవర్గం.. భారత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూది!
అతీక్ అహ్మద్ నేర చరిత్ర..
Atiq Ahmad criminal record : అతీక్ అహ్మద్ నేర చరిత్ర చాలా ఎక్కువే ఉంది! రాష్ట్రంలో గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో 101 నేరాల్లో అతడి హస్తం ఉంది. పోలీసుల రికార్డు ప్రకారం.. 1979లో తొలిసారిగా అతడిపై మర్డర్ కేసు నమోదైంది. అక్కడి నుంచి మర్డర్లు, హత్యాయత్నం, కిడ్నాప్, మోసం, బెదిరింపులు, భూదందా.. ఇలా అనేక కేసులు అతడిపై నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ.. అతడు ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రజలు అన్నిసార్లు గెలిపించడం గమనార్హం!
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో అతీక్ అహ్మద్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అతీక్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అతడి సోదరుడు ఖలీద్ అజీమ్ పాల్గొన్న ఎన్నికలో నిలబడి గెలిచారు రాజు పాల్ (అల్లహాబాద్ వెస్ట్ అసెంబ్లీ సీటు). గెలిచిన మూడు నెలలకే రాజు పాల్ దారుణ హత్యకు గురయ్యాడు.
Atiq Ahmed latest news : గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్ అహ్మద్‌పై.. ఉమేశ్ పాల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉంది. రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షి. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకూడదని ఉమేశ్ పాల్‌ను అతీక్ బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2006లో ఉమేశ్ పాల్‌ను అపహరించినందుకు.. కోర్టు అతనికి ఇటీవలే జీవిత ఖైదు విధించింది.
Atiq Ahmad political journey : అతీక్ అహ్మద్ పతనం 2016లో మొదలైందని చెబుతుంటారు. 2016లో ఓ కాలేజీ సిబ్బందిపై అతడి అనుచురులు దాడి చేశారు. పరీక్షలో చీటింగ్ చేస్తూ దొరికిపోయిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునందుకు ఈ దాడి జరిగింది! ఈ ఘటన అనంతరం పోలీసులు 2017లో అతీక్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 2018లో రాష్ట్రం బయటకు తరలించి.. గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉంచారు. గత నెల వరకు అతను అక్కడే ఉన్నాడు. ఉమేశ్ పాల్ కేసులో కోర్టులో హాజరు పరిచేందుకు అతడిని పోలీసులు ప్రయాగ్‌రాజ్ తీసుకొచ్చారు. చివరికి శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
సంబంధిత కథనం