Suresh Raina : సురేశ్ రైనా బంధువుల మర్డర్ కేసు నిందితుడి ఎన్కౌంటర్!
02 April 2023, 9:16 IST
Suresh Raina news : 2020 సురేశ్ రైనా బంధువుల హత్య కేసు నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అతను వాంటెడ్ క్రిమినల్ రషీద్ అని పోలీసులు వివరించారు.
సురేశ్ రైనా బంధువుల మర్డర్ కేసు నిందితుడు హతం!
Suresh Raina news : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బందువుల హత్య కేసులో నిందితుడు, వాంటెడ్ క్రిమినల్ రషీద్‌ను.. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాహ్పూర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు అధికారులు వివరించారు.
2020లో ఏం జరిగింది..?
సురేశ్ రైనా బంధువులు పతాన్కోట్లోని థర్యాల్ గ్రామంలో నివాసముండేవారు. రైనా మామ అశోక్ కుమార్ ఓ కాంట్రాక్టర్. అతని భార్య పేరు ఆషా రాణి, కొడుకు పేరు కౌషల్.
Suresh Raina relatives murder : 2020 ఆగస్టు 19 అర్ధరాత్రి వేళ.. వేరువేరు ప్రాంతాల నుంచి 2,3 బృందాలు థర్యాల్పై దాడి చేశాయి. అర్ధరాత్రి వేళ ఇళ్లల్లోకి ప్రవేశించి దోపిడీ చేయడం, అడ్డొచ్చిన వారిని హత్య చేయడం ఈ బృందాలకు అలవాటు. వీరిపై అనేక ప్రాంతాల్లో ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ రాత్రి.. తొలుత 2 ఇళ్లపై దాడి చేసినా ఫలితం దక్కలేదు. మూడోసారి.. అశోక్ కుమార్ ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. నిచ్చెన సాయంతో ఐదుగురు లోపలికి వెళ్లారు. సురేశ్ రైనా బంధువులు నేలపై పడుకుని ఉండటాన్ని చూశారు. నిందితులు.. బాధితుల తలపై గట్టిగా కొట్టారు. అనంతరం వివిధ గదుల్లోకి వెళ్లి నగదు, బంగారాన్ని దోచుకుని, అక్కడి నుంచి తప్పించుకున్నారు. అశోక్ కుమార్ అక్కడిక్కడ చనిపోయారు. కౌషల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అషా రాణితో పాటు మరో ఇద్దరు.. గాయాలతో బయటపడ్డారు.
సురేశ్ రైనా బంధువులు కావడంతో ఈ ఘటన మరుసటి రోజు ఉదయమే వార్తలకెక్కింది. చివరికి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Criminal Rashid encounter : ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ బృందాలు రషీద్ అలియాస్ చల్తా ఫిర్తా అలియాస్ సిపాహియా అనే కరుడుగట్టిన దొంగ, నేరస్తుడికి చెందినదని గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటవరకు ఘటనకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. చివరికి రషీద్‌ను ఎన్కౌంటర్ చేశారు.
ఎన్కౌంటర్ జరిగింది ఇలా..
రషీద్‌పై 10కిపైగా దోపిడీ, హత్య కేసులు ఉన్నాయి. అతని తలపై రూ.50వేల రివార్డు కూడా ఉంది. అతడిని పట్టుకునేందుకు పోలీసులు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా.. షాహ్పూర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఓ ప్రాంతంలో రషీద్ బృందం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. శనివారం అతడిని పట్టుకునేందుకు వెళ్లారు. పోలీసులను చూసిన రషీద్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
Suresh Rain relatives death : బైక్‌పై నుంచి పోలీసులపై కాల్పులు జరిపాడు రషీద్. ప్రతిఘటించిన పోలీసులు.. రషీద్‌తో పాటు బైక్ నడుపుతున్న మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రషీద్ మరణించాడు. ఘటనాస్థలం నుంచి రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.