Theft In Ps: పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..105 కేజీల వెండి మాయం చేశారు.-105 kg of silver was missing in the police station and suspicions are on the police staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Theft In Ps: పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..105 కేజీల వెండి మాయం చేశారు.

Theft In Ps: పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు..105 కేజీల వెండి మాయం చేశారు.

HT Telugu Desk HT Telugu
Mar 31, 2023 05:57 AM IST

Theft In Ps: కర్ణాటక సరిహద్దులో ఉన్న కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వెండి మాయమైంది. పోలీస్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య సీజ్ చేసిన వెండి గల్లంతైంది. తన సొత్తు అప్పగించాలని వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

కర్నూలు పోలీస్ స్టేషన్‌లో 105కేజీల వెండి మాయం
కర్నూలు పోలీస్ స్టేషన్‌లో 105కేజీల వెండి మాయం

Theft In Ps: అంతరాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీస్ స్టేషన్లో సొత్తు మాయం కావడం కలకలం రేపింది. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో రూ. 75 లక్షల విలువైన వెండి మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 2021 జనవరి 28వ తేదిన కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబి సీఐ లక్ష్మీ దుర్గయ్య వాహనాలు తనిఖీ చేపట్టారు. హైదరాబాదు వైపు నుంచి వస్తున్న తమిళనాడుకు చెందిన కారును ఆపి తనిఖీ చేయగా శాతన భారతి, మణికందన్ అనే ఇరువురు వ్యాపారుల వద్ద నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు.

తమిళనాడుకు చెందిన వ్యాపారుల వద్ద వెండికి సంబంధించి ఎలాంటి ధృవ పత్రాలు లేకపోవడంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్ చేసి అప్పటి కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ విక్రమ్ సింహాకు అప్పగించారు. ఆ తర్వాత వెండిని వాణిజ్య పన్నుల శాఖకు గాని, ఆదాయ పన్నుల శాఖకు అప్పగించాల్సి ఉన్నా అలా చేయలేదు.

పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును పోలీస్ స్టేషన్లోని బీరువాలో ఉంచారు. స్టేషన్‌లో పనిచేసే ఓ మహిళా కానిస్టేబుల్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత అక్కడ పనిచేసే సిబ్బంది మారిపోయారు. సిఐగా పనిచేసిన విక్రమ్ సింహా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సిఐ కంబగిరి రాముడు కొంతకాలం పనిచేసి అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు.

ఆ తర్వాత 2022 మార్చి నెలలో సిఐ శేషయ్య సిఐగా బాధ్యతలు చేపట్టారు. 2022 నవంబర్లో సిఐ శేషయ్య బదిలీ కావడంతో సిఐ రామలింగయ్య వచ్చారు. స్వాధీనం చేసుకున్న ఏడాదిన్నర వరకు వెండికి సంబంధించిన వ్యాపారులు స్టేషన్‌కు రాలేదు.ఈ నెల 27వ తేదీన తమిళ వ్యాపారులు శాతన భారతి, మణికందన్ న్యాయస్థానం నుంచి అనుమతి పొంది, కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సొత్తును అప్పగించాలని సిబ్బందిని కోరారు.

ఆ సమయంలో అక్కడ ఉన్న సిఐ రామలింగయ్య బీరువా తెరిచి చూసి కంగుతిన్నారు. బీరువాలో 105 కిలోల వెండి గాని స్వాధీనం చేసుకున్న డబ్బులు గానీ లేకపోవడంతో నిర్ఘాంత పోయారు. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో సిబ్బంది ఖంగితున్నారు. కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో 105 కిలోల వెండిని నగదును తస్కరించిన ఇంటి దొంగలు ఎవరనేది మిస్టరీగా మారింది.

2021 నుండి సిఐ విక్రం సింహాతో పాటు మరో ఇరువురు సిఐలు బదిలీ అయ్యారు. ప్రస్తుతం నాలుగో సీఐగా రామలింగయ్య పనిచేస్తున్నారు. స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులతో పాటు పలువురు సిబ్బంది బదిలీ అయ్యారు. ఏ సిఐ హయాంలో వెండి, నగదు అపహరణకు గురైందనేది అంతు చిక్కలేదు. వ్యాపారుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు అక్కడ పనిచేసిన నలుగురు సిఐలను విచారించారు.

ఈ క్రమంలో సిబ్బంది సొత్తును మాయం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో మద్యం సీసాలు తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ఇరువురు హెడ్ కానిస్టేబుళ్ల పాత్ర ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీస్ సిబ్బందే వెండిని అమ్మేసుకుని సొమ్ము చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయకుండా ఇంటి దొంగలను పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

IPL_Entry_Point