తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal : అరవింద్​ కేజ్రీవాల్​కి బెయిల్​ మంజూరు చేసిన సుప్రీంకోర్టు- కానీ..

Arvind Kejriwal : అరవింద్​ కేజ్రీవాల్​కి బెయిల్​ మంజూరు చేసిన సుప్రీంకోర్టు- కానీ..

Sharath Chitturi HT Telugu

12 July 2024, 11:24 IST

google News
    • ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్​కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన జైలులోనే ఉంటారు. కారణం ఏంటంటే..
దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​
దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​

దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​

లిక్కర్​ పాలసీ స్కామ్​లో ఈడీ వేసిన మనీలాండరింగ్​ కేసులో దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి భారీ ఊరట లభించింది! కేజ్రీవాల్​కి మధ్యంతర బెయిల్​ని మంజూరు చేస్తూ శుక్రవారం ఉదయం కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్​ ఇప్పటికే 90 రోజుల పాటు జైలులో ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తూ తీర్పును వెలువరించింది జస్టిస్​ సంజీవ్​ ఖన్న, జస్టిస్​ దీపంకర్​ దత్తలతో కూడిన సుప్రీం ధర్మాసనం.

సుప్రీంకోర్టు బెయిల్​ మంజూరు చేసినా, అరవింద్​ కేజ్రీవాల్​ ప్రస్తుతం జైలులోనే ఉండనున్నారు. ఇదే లిక్కర్​ పాలసీ స్కామ్​లో ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉండటం ఇందుకు కారణం.

ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్​ని మార్చ్​ 21న ఈడీ అరెస్ట్​ చేసింది. దిల్లీ లిక్కర్​ పాలసీ స్కామ్​లో ఆయనపై మనీ లాండరింగ్​ కేసు వేసింది. కాగా ఓ ట్రయల్​ కోర్టు ఆయనకు బెయిల్​ మంజూరు చేసింది. కానీ దానిని దిల్లీ హైకోర్టు తోసి పుచ్చింది. కేజ్రీవాల్​ అరెస్ట్​ అక్రమం కాదని, ఈడీ సమన్లు ఇచ్చినా ఆయన విచారణకు హాజరవ్వలేదని చెబుతూ.. బెయిల్​ని నిలిపివేసింది.

ఇదే విషయంపై, దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టుకు వెళ్లారు అరవింద్​ కేజ్రీవాల్​. ఈ విషయంపై విస్తృతంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా కేజ్రీవాల్​కి బెయిల్​ మంజూరు చేసింది. కేజ్రీవాల్​పై కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసుల్లో అరెస్టులు చేయడానికి దర్యాప్తు అధికారులకు ఎక్కువ విచక్షణాధికారం ఇవ్వడాన్ని లోతుగా చూడాల్సిన అవసరం, ఆవశ్యకత గురించి విస్తృత ఆ ధర్మాసనమే నిర్ణయించాలని పేర్కొంది.

అదే సమయంలో అరెస్ట్​ అయినప్పటికీ, సీఎం పదవికి రాజీనామా చేయమని అరవింద్​ కేజ్రీవాల్​ని తాము ఆదేశించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ నిర్ణయం కేజ్రీవాల్​ స్వయంగా తీసుకోవాలని పేర్కొంది.

అరవింద్​ కేజ్రీవాల్​కి బెయిల్​ లభించడంపై ఆప్​ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"సత్యమేవ జయతే" అని ఎక్స్​లో పార్టీ పోస్ట్​ చేసింది.

"కేజ్రీవాల్​ని తప్పుగా అరెస్ట్​ చేశారని ట్రయల్​ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అందరు భావిస్తున్నారు," అని పార్టీ నేత సంజయ్​ సింగ్​ తెలిపారు. ఇదే లిక్కర్​ కేసులో అరెస్ట్​ అయిన సంజయ్​ సింగ్​, ప్రస్తుతం బెయిల్​పై బయట ఉన్నారు.

'మోదీజీ, తప్పుడు కేసులు పెట్టి నిజాన్ని ఎంతకాలం జైల్లో పెడతారు? మీ నియంతృత్వాన్ని దేశం మొత్తం చూస్తోంది,' అని హిందీలో ఎక్స్​లో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు సత్యానికి దక్కిన విజయమన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్ధమని ప్రకటిస్తే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) దుర్వినియోగానికి సుప్రీంకోర్టు తీర్పు పెద్ద మైలురాయిగా మారుతుందని దిల్లీ మంత్రి, ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ నొక్కి చెప్పారు. ఈ తీర్పు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని, ఈ తీర్పు దేశ రాజ్యాంగాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టును తీర్పును ఈడీ సవాలు చేస్తుందా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతానికైతే కేజ్రీవాల్​ సీబీఐ కస్టడీలోనే ఉంటారు.

తదుపరి వ్యాసం