Delhi Liquor Case : దిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్.. కోర్టు అనుమతి
Arvind Kejriwal Liquor Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
ఎక్సైజ్ స్కామ్‌కు సంబంధించిన కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు దీల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. సీబీఐ అధికారిక దరఖాస్తును అనుసరించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి ఉదయం కోర్టుకు తీసుకొచ్చారు.
కేజ్రీవాల్ ను కస్టడీకి కోరుతూ సీబీఐ దరఖాస్తు చేసింది. దీంతో ఈ ఎక్సైజ్ కుంభకోణంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి దిల్లీ కోర్టు బుధవారం అనుమతినిచ్చింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దేశ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారికంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కిందటి గురువారం మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంపై ఈడీ దిల్లీ హైకోర్డు మెట్లుఎక్కింది. తమ వాదనాలకు సరైన సమయం ఇవ్వలేదని పేర్కొంది. విచారణ చేసిన దిల్లీ న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ విషయంపై విచారణ చేసి.. బెయిల్ అమలును నిలిపివేస్తూ.. తీర్పునిచ్చింది. ట్రయల్ కోర్టు ఈడీ ఇచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని మందలించింది.
మరోవైపు ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ ఆపరేషన్‌పై మధ్యంతర స్టే మంజూరు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను మినహాయించి మార్చి 21 నుండి కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు.
2021-22 ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై కేజ్రీవాల్‌పై కేసు వచ్చింది. జూలై 2022లో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు మేరకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.