తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Disqualification : అనర్హత వేటు ఎపిసోడ్​తో 'రాహుల్​ గాంధీ 2.0' సాధ్యమేనా?

Rahul Gandhi disqualification : అనర్హత వేటు ఎపిసోడ్​తో 'రాహుల్​ గాంధీ 2.0' సాధ్యమేనా?

HT Telugu Desk HT Telugu

26 March 2023, 14:10 IST

google News
  • Rahul Gandhi disqualification news : అనర్హత వేటు అన్నది రాహుల్​ గాంధీకి ఓ వరం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాహుల్​ గాంధీ.. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, మోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు మంచి అవకాశం అని పలువురు భావిస్తున్నారు.

అనర్హత వేటు ఎపిసోడ్​తో 'రాహుల్​ గాంధీ 2.0' సాధ్యమేనా?
అనర్హత వేటు ఎపిసోడ్​తో 'రాహుల్​ గాంధీ 2.0' సాధ్యమేనా? (AFP)

అనర్హత వేటు ఎపిసోడ్​తో 'రాహుల్​ గాంధీ 2.0' సాధ్యమేనా?

Rahul Gandhi disqualification news : 'రాహుల్​ గాంధీ'.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. లోక్​సభలో అనర్హత వేటుతో ఈ కాంగ్రెస్​ వారసుడు ఇప్పుడు వార్తలకెక్కారు. రాహుల్​పై ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు ఊపందుకున్నాయి. తాజా పరిణామాలను చూస్తే.. రాహుల్​ను బీజేపీ టార్గెట్​ చేసినట్టు కనిపిస్తోంది. అయితే.. ఈ పరిస్థితులు రాహుల్​కే మంచిదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇంతకాలం తనకు ఉన్న 'పప్పు' పేరును తొలగించుకునేందుకు, ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఇమేజ్​ను దెబ్బతీసేందుకు.. అటు రాహుల్​కు, ఇటు కాంగ్రెస్​కు ఇదే మంచి అవకాశం అని పలువురు భావిస్తున్నారు. మరి ఇది సాధ్యమేనా?

బీజేపీ అస్త్రం.. ‘పప్పు’!

దేశ రాజకీయాల్లో 'పప్పు' అన్న పేరు వినపడగానే ముందుగా గుర్తొచ్చే పేరు రాహుల్​ గాంధీ. సొంత తప్పిదాల కన్నా.. బీజేపీ విజయవంతంగా చేసిన ప్రచారాల వల్లే ఆయనకు ఆ పేరు వచ్చింది! ప్రధాని మోదీని ఢీకొట్టలేక అనేకమార్లు రాహుల్​ గాంధీ చతికిలపడగా.. అదే అదునుగా భావించిన బీజేపీ ఐటీ సెల్​ ఆయనపై 'పప్పు' అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఫేక్​ న్యూస్​, మీమ్స్​, జోక్స్​, ట్రోల్స్​.. ఇలా సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లో ఉన్న అన్నింటినీ వాడుకుని, కాంగ్రెస్​ వారసుడిని ఇరకాటంలో పెట్టింది. బీజేపీ ప్రయత్నం ఎంతలా సక్సెస్​ అయ్యిందంటే.. వారసత్వ, కాంగ్రెస్​ రాజకీయాలు గిట్టని దేశంలోని చాలా మంది.. రాహుల్​ గాంధీని ఇప్పటికీ పప్పుగానే పరిగణిస్తున్నారు!

Rahul Gandhi latest news : కానీ ఇటీవలి కాలంలో రాహుల్​ గాంధీ విషయంలో కమలదళం హైకమాండ్​ ఆలోచనలు మారినట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు రాహుల్​ను 'పప్పు'గా భావించిన వారు.. ఇప్పుడు ఆయనపై సీరియస్​గా ఫోకస్​ చేసినట్టు అర్థమవుతోంది. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణ.

పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీకి జైలు శిక్ష పడటం, 24 గంటల వ్యవధిలోనే ఆయన తన ఎంపీ సీటు కోల్పోవడం.. అన్ని చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్​ మాటల్లో చెప్పాలంటే.. రాహుల్​ గాంధీ గొంతును అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతుండటం.. దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారింది. ఇవన్నీ చూస్తుంటే.. బీజేపీకి రాహుల్​ గాంధీ ఇక ఏమాత్రం 'పప్పు' కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాహుల్​ 2.0 సాధ్యమేనా?

Rahul Gandhi defamation case : 'పప్పు' అన్న ముద్ర.. రాహుల్​ గాంధీని చాలా కాలం నుంచి వెంటాడుతూనే ఉంది. దానిని చెరిపేసేందుకు ఆయన చాలా ప్రయత్నాలే చేశారు. కానీ ఫలితం దక్కలేదు. అయితే.. ఈ కాంగ్రెస్​ వారసుడు మునుపటి కన్నా ఎంతో సీరియస్​గా, ధృఢంగా కనిపిస్తున్నారు. ప్రజల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. వార్తల్లో ఎక్కువ నిలుస్తున్నారు. మోదీ, అదానీ విషయంలో బీజేపీకి ధీటుగా నిలబడుతున్నారు. తనపై అనర్హత వేటు పడిన అనంతరం ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో "క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్​ని కాదు. నా పేరు గాంధీ, గాంధీలు క్షమాపణలు చెప్పరు" అంటూ రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా వార్తల్లో హెడ్​లైన్స్​కి ఎక్కాయి.

ఈ పరిణామాల మధ్య కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీడియా సమావేశంలో ఉన్నంత గంభీరంగా, ధైర్యంగానే రానున్న రోజుల్లో రాహుల్​ ఉంటారా? 2024 సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. తాను పప్పు కాదు అని నిరూపించుకోగలరా?

Rahul Gandhi defamation case live : ఇంత కాలం జరిగినవి పక్కన పెడితే.. ఇటీవలి పరిణామాలు రాహుల్​ గాంధీకి ఒకింత మంచి చేసేవే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదానీపై ప్రశ్నిస్తున్న వారిని అధికారపక్షం టార్గెట్​ చేసి మరీ వెంటాడుతోందన్న వాదనను కాంగ్రెస్​ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తే.. కమలదళానికి ఇక్కట్లు తప్పవు! ఈ విషయంపై విపక్షాలను ఏకథాటిపై నడిపిస్తే.. మోదీపై పోరులో కాంగ్రెస్​ అతిపెద్ద విజయం సాధించినట్టే. ఇదంతా రాహుల్​ గాంధీ చేతుల్లోనే ఉంది! ఒక్క మాటలో చెప్పాలంటే.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాహుల్​ గాంధీ తనని తాను కొత్త ఆవిష్కరించుకోవడం ఇప్పుడు అత్యావసరం. మరి రాహుల్​ 2.0ని దేశప్రజలు చూస్తారా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.

అంత ఈజీ కాదు.. కానీ!

అయితే.. రాహుల్​ 2.0 అన్నది అంత సులభమైన టాస్క్​ కాదు. బీజేపీ కారణంగా ఇప్పటికీ చాలా మంది మిడిల్​ క్లాస్​ ప్రజలు రాహుల్​ని పప్పుగాను, కాంగ్రెస్​ను వారసత్వ పార్టీగాను చూస్తున్నారు. కమలదళం పన్నిన ఈ ఉచ్చు నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అలా అని కాంగ్రెస్​, రాహుల్​లు చేతులెత్తేయాల్సినంత కష్టం కూడా కాదు! రాహుల్​ గాంధీపై పడిన అనర్హత వేటును కాంగ్రెస్​ పార్టీ ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత మంచిది. 'బీజేపీ అధికార దుర్వినియోగం' నినాదంతో ప్రజల్లోకి వెళ్లితే కాస్త సక్సెస్​ సాధించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Rahul Gandhi MP status : అయితే ఈ పూర్తి ఎపిసోడ్​ నుంచి కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. రాహుల్​ గాంధీ ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి కార్యకర్తలు, పార్టీ సభ్యులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పార్టీలోని పేరుమోసిన లీడర్​గే ఇలా జరిగితే.. తమ పరిస్థితేంటని ఆలోచిస్తున్నారు. విపక్షాలు సైతం.. కాంగ్రెస్​తో పొత్తు ఏర్పరచుకునేందుకు ఒకింత ఆలోచిస్తున్నాయి. ఇవి ప్రమాదకరంగా మారే ముందే.. కాంగ్రెస్​ మేలుకోవాలి. లక్ష్యాలు పెట్టుకుని ముందుకెళ్లాలి.

రాహుల్​ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయం అంటూ కాంగ్రెస్​ ప్రచారాలు చేయకుండా.. అనర్హత వేటును అస్త్రంగా ఉపయోగించుకుని బీజేపీకి అత్యంత బలమైన 'జాతీయవాదం'పై కొట్టాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్​ కొట్టే దెబ్బకు దేశంలోని విపక్షాలు ఏకమవ్వాలని, అదానీ- మోదీ సంబంధాలపై ప్రశ్నల తీవ్రత మరింత పెరగాలని చెబుతున్నారు. అదానీ స్కామ్​ను ప్రశ్నిస్తే.. దేశానికి వ్యతిరేకంగా నిలబడినట్టు కాదని నిరూపించాలని స్పష్టం చేస్తున్నారు.

అంతా రాహుల్​ చేతుల్లోనే..!

Congress protest Rahul Gandhi : ఇవన్నీ జరగాలంటే ఓ మార్గం ఉంది. అదానీ వ్యవహారంపై ప్రత్యేక పార్లమెంట్​ సెషన్​ నిర్వహించే విధంగా ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంట్​ సెషన్​ జరగకపోతే మూకుమ్మడి రాజకీయాలకు దిగుతామని హెచ్చరించాలి. రియాలిటీలో ఇది జరగడం కష్టమే అనిపించినా.. ఈ హెచ్చరికలతో బీజేపీ జాతీయవాదాన్ని దెబ్బతీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా.. బీజేపీ అపర చాణుక్యులు.. రాహుల్​ గాంధీకి, కాంగ్రెస్​కు, విపక్షాలకు మంచి అవకాశాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాహుల్​ గాంధీ.. ప్రజల్లో మోదీకి ఉన్న ఇమేజ్​ను దెబ్బతీయగలరా? తనపై ఉన్న పప్పు బిరుదుని తొలగించుకోగలరా? తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోగలరా? విపక్షాలను ఏకథాటిపైకి తీసుకురాగలరా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న కాలంలో తెలిసిపోతుంది.

తదుపరి వ్యాసం