Budget Session: పార్లమెంటులో ‘అదానీ’పై చర్చ జరగాల్సిందే: విపక్షాల డిమాండ్.. కులాల వారీగా జనగణనకు వైసీపీ ప్రతిపాదన
Parliament Budget Session 2023: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు అన్ని పార్టీలతో సమావేశం (All-Party Meet) ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ సందర్భంగా కొన్ని పార్టీలు వివిధ డిమాండ్లు చేశాయి.
Parliament Budget Session 2023: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం (జనవరి 31).. బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆల్-పార్టీ మీటింగ్‍ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో కొన్ని అంశాలపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా గౌతమ్ ఆదానీ కంపెనీలపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగాలని ఆమ్‍ఆద్మీ పార్టీతో పాటు వామపక్షాలు పట్టుపట్టాయి. వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓ కీలక ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. వివరాలివే..
‘అదానీ’ సమస్యపై..
Parliament Budget Session 2023: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అదానీ గ్రూప్ కంపెనీల గురించిన చర్చ జరగాలని ఆమ్ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝాతో పాటు డీఎంకే, వామపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ వివాదాన్ని ఆల్-పార్టీ మీటింగ్‍లో లేవనెత్తాయి. అదానీ కంపెనీలపై అమెరికాకు చెందిన హిండన్‍బర్గ్ (Hindenburg).. సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్స్ అవకతవకలకు పాల్పడిందంటూ ఆరోపించింది. దీన్ని అదానీ గ్రూప్స్ ఖండించింది. మరోవైపు, ప్రధాని మోదీపై బీబీసీ రూపొందిన డాక్యుమెంటరీ (BBC Documentary on Modi)పైనా చర్చ జరగాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేశాయి.
కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలి
Parliament Budget Session 2023: దేశ వ్యాప్తంగా కులాల ఆధారంగా జనాభా లెక్కింపు జరగాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) డిమాండ్ చేసింది. వెనుకబడిన తరగతుల (Backward Castes -BC) ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ విధానం చాలా అవసరమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఆల్-పార్టీ మీటింగ్‍లో అన్నారు. ఈ విధానంతో ఆర్థికంగా ఎదగని వెనుకబడిన తరగతుల వారిని గుర్తించవచ్చని పేర్కొన్నారు. మొత్తం జనాభాలో బీసీలు 50 శాతంగా ఉన్నారని, వారికి సాహాయపడేందుకు కులాల వారీగా జనగణన తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‍కు జేడీయూ, ఆర్జేడీ మద్దతు పలికాయి. ఇప్పటికే బిహార్‌లో కుల ఆధారిత జనాభా లెక్కింపును జేడీయూ చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ కూడా దీనికి మద్దతు తెలిపాయి.
అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం
ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
Parliament Budget Session 2023 Date: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న మొదలుకానున్నాయి. లోక్‍సభ, రాజ్యసభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఎకనమిక్ సర్వే (Economic Survey) కూడా తొలి రోజే సభ ముందుకు రానుంది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‍ను (Union Budget 2023-24) నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. మొత్తంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగుతాయి. తొలి దశ బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 14న ముగుస్తుంది. మళ్లీ మార్చి 12న రెండో దశ మొదలవుతుంది.
సంబంధిత కథనం